మందులేకుండా విందు నడవదా..?

మందులేకుండా విందు నడవదా..?

తెలంగాణ పల్లెల్లో గ్రామదేవతలు ఎక్కువ. బొడ్రాయి, ఎల్లమ్మ, మల్లన్న, దుర్గమ్మ, పోచమ్మ ఇలా ఏడాదికి ఏదో ఒక పండుగ ఉంటుంది. ఏ పండుగైనా దావత్‌ కంపల్సరి. అయితే తిండి కన్నా ఎక్కువ మందుకు ఖర్చు పెడుతున్నారు.
ఫెయిల్యూర్‌‌కి మందే..సక్సెస్‌లు, సంతోషాలు వస్తే మందే. ప్రేమ లేదా రిలేషన్‌షిప్‌ ఫెయిల్‌ అయినా మందే కావాలంటారు తాగేటోళ్లు. అయితే, ఆ సమస్యలకు మందు ఎలా పరిష్కారం అవుతాయి? తాగితే సమస్యలు పోతయా అన్నది ప్రశ్న.

మందు లేకుండా దావత్‌లు చేసుకోవాలని అంటున్న చేగోంటి చంద్రశేఖర్. దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి.. సమాజంలో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘దావత్‌ వితవుట్‌ దారు అనే క్యాంపెయిన్ మొదలు పెట్టారు.

Zindagi images Campaign 'Dawat Without daru'

ఈ మధ్య సినిమాలల్ల మందు తాగడం ఫ్యాషన్‌ అయింది. వాళ్లు మందు తాగుతుంటే..స్క్రీన్‌ కింద ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని చిన్నగా వస్తది. దాన్నెవరూ చూడరు. హీరో మందు తాగుతుండు. మందు తాగితేనే హీరో.. ఆ హీరోలా మందు తాగాలని.. అట్లాంటి వాళ్లనే అమ్మాయిలు ఇష్టపడుతరనే విధంగా ఇటీవల వస్తున్న సినిమాల్లో చూపించడం పెరిగిపోయింది. యూత్‌ దాన్నే పట్టుకుంటున్నరు. బయట జరుగుతున్నదే సినిమాల్లో తీస్తున్నమని డైరెక్టర్లు అంటుంటే.. సినిమాల్లో చూపించిందే బయట ఫాలో అయితున్నరని జనాలు అంటున్నరు. ఏది ఏమైనా..వాటి ప్రభావంతో తాగడం ఒక ఫ్యాషన్‌గా ఫీల్‌ అయితున్న యూత్‌ పెరుగుతున్నరు.
రిలాక్సేషన్‌ అనుకుంటున్నరు

‘రోజంతా పని చేసినం.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్‌. రెండు పెగ్గులు మందేస్తే మంచిగా నిద్ర పడ్తది’ అనుకునే శ్రామికులు, కార్మికులు చాలా మంది ఉన్నరు. రిక్షా తొక్కేవాళ్లు, ఇళ్లు కట్టే భవన నిర్మాణ కార్మికులు, లేబర్‌‌ పని చేసేవాళ్లు ఇట్ల రోజూ తాగుతున్నరు. వాళ్ల కుటుంబాలను నడమంతరాన వదిలిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నరు. పగలంతా పని చేసినం కాబట్టి ‘మందు దానికి రిలాక్సేషన్‌’ అనుకోవడం వల్లే ఇట్లా జరుగుతోంది.

నేరాల వెనుకా మందే!

మందుని మాములుగా చూడొద్దు. ఏదో తాగుతం.. మూత్రంల పోతదనుకోవద్దు. దీంతోనే మత్తు వస్తది. మైండ్‌ స్టిములేట్‌ కావడం వల్ల ఒక ఉన్మాదపు ధైర్యం వస్తది. ఇదే నేరాలు చేసేలా ప్రేరేపిస్తది. ఎన్నో నేరాల వెనుక మందుదే ముఖ్య పాత్ర.

ఏది నిజమైన దావత్‌?

నిజమైన దావత్‌ అంటే.. తాగి పంచాయితీ పెట్టుకుని పెళ్లాన్ని , పిల్లల్ని కొట్టి… వాంతులు చేసుకుని.. రోడ్ల మీద పండుకుని.. వానితోని వీనితోని గొడవ పడటం కాదు. ఫూటుగా తాగి.. లివర్‌‌, కిడ్ని కరాబ్‌ చేసుకోవడం అంతకన్నా కాదు. సినిమా హీరోల్లా తాగి.. సీసాలు పగలగొట్టడం, ఫైటింగ్ చెయ్యడం అస్సలు కాదు. నిజమైన దావత్‌ అంటే మందు లేకపోవడం. మంచిగ తిని.. దోస్తులు, ఫ్యామిలీతో సంతోషంగా గడపడం.

మహిళలే స్ఫూర్తి…

మన ఇంట్లనే చూసుకుంటే అందరికంటే ఎక్కువ స్ట్రెస్‌ అయ్యేది మహిళలే. వాళ్లే ఫ్యామిలీ బాలేకున్నా.. రిలేషన్‌షిప్‌ బాధలను అనుభవించేది. అయినా వాళ్లు సంతోషం మందులో వెతకడం లేదే? వాళ్ల సమస్యలకు మందు పరిష్కారం అనుకోవడం లేదు. మందు లేకున్నా సంతోషంగా ఉండగలమని, మందు లేకున్నా ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోగలమనే దానికి మహిళలే మంచి ఉదాహరణ. ‘ఇప్పుడు వాళ్లు కూడా తాగుతున్నరు’ అనే వాళ్లు ఉంటరు. కానీ, చాలా తక్కువ. మందు తాగని మహిళలని స్ఫూర్తిగా తీసుకుని మందు ఒక భ్రమ అని అర్థం చేసుకోవాలె.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *