ఏయే జిల్లాలో వైసీపీకి ఎన్ని సీట్లో పూర్తి వివరాలు..

ఏయే జిల్లాలో వైసీపీకి ఎన్ని సీట్లో పూర్తి  వివరాలు..

ఒకటి కాదు రెండు కాదు.. అన్ని జిల్లాలు దాదాపు క్వీన్‌స్వీప్‌ చేసింది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఎవరూ ఊహించని విధంగా 151 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదిపత్యం ప్రదర్శించింది. మరోవైపు ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కొట్టుకుపోయింది. ఇంతకీ ఏయే జిల్లాలో వైసీపీ ఎన్ని సీట్లు సాధించింది.?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయింది. మెజారిటీ జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ పత్తా లేకుండా పోయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్ కు ఫ్యాక్స్‌లో పంపారు. చంద్రబాబు రాజీనామాను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని కోరారు.

ఇదిలాఉంటే.. ఈ సారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోమారు గెలుస్తుందన్న ధీమాతో ఆపార్టీ నేతలు ఉన్నా… అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు గట్టి షాకిచ్చారు. గత ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీ.. ఈసారి పూర్తిగా చతికిలపడింది. ఫలితాల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదిపత్యం ప్రదర్శించింది. ప్రజా సమస్యలపై గడిచిన ఐదేళ్లుగా జగన్‌ సాగించిన అనేక ఆందోళనలు, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండటం, గడిచిన ఏడాది కాలం పాటు ప్రజల మధ్య కొనసాగించిన పాదయాత్ర ఈ ఫలితాలకు కారణమైనట్టు ఆపార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి టీడీపీకి ఎదురుదెబ్బే తగిలింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాత్రి 10 గంటల తర్వాత కూడా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ వీవీప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించడంలో కాస్త జాప్యం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాల్లో 8 సీట్లు, విజయనగరం జిల్లాలో 9కి 9 క్లీన్‌స్వీప్‌ చేయగా.. అటు విశాఖలో 15 సెగ్మెంట్లకు 11, తూర్పు గోదావరిలో 19 నియోజకవర్గాలకు 14 స్థానాలు, పశ్చిమ గోదావరిలో 15 సెగ్మెంట్లలో 12 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఇటు కృష్ణా జిల్లాలోని 16 స్థానాల్లో 13 సీట్లు, గుంటూరు జిల్లాలోని 17 సెగ్మెంట్లలో 14, నెల్లూరు పదికి పది స్థానాలు గెలుపొందింది. అటు ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలో 8, అనంతపురంలోని 14 స్థానాల్లో 12 సీట్లు, కడపలో పదికి పది అలాగే కర్నూలులోనూ క్వీన్‌ స్వీప్‌ చేసింది. చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 సీట్లు వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇలా ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ విజయఢంకా మోగించింది.

ఇలా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ అదిపత్యం ప్రదర్శించింది వైసీపీ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *