ఏపీలో వైసీపీ ప్రభంజనం...

ఏపీలో వైసీపీ ప్రభంజనం...

ఏపీలో ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కొట్టుకుపోయింది. గాజు గ్లాసు పగిలింది. కాంగ్రెస్‌, బీజేపీలు నామమాత్ర పోటీ ఇవ్వలేక పోయాయి. జగన్‌ ప్రభంజనానికి టీడీపీలోని కీలక నేతలు, మంత్రులు సైతం ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ నెల 30 జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ అనంతరం దాదాపు 42 రోజుల తీవ్ర ఉత్కంఠ నడుమ గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది.

ఇదిలాఉంటే.. అధికార టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఇటు శాసనసభతో పాటు అటు లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటమిని మూటకట్టుకుంది. చంద్రబాబు తనయుడు లోకేష్ సహా పలువురు కీలక నేతలు, మంత్రులు ఓటమి చవిచూశారు. మరోవైపు తొలినుంచి దూకుడు ప్రదర్శించిన జనసేన ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మట్టికరిచింది.

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 151 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. జనసేన ఒక నియోజకవర్గానికి పరిమితం కాగా కాంగ్రెస్‌ గల్లంతైంది. జిల్లాల వారిగా ఫలితాలను గమనిస్తే గతంలో ఎంతో అండగా నిలిచిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీకి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ప్రతి ఎన్నికలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఈసారి మెజారిటీ కూడా తగ్గింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలవగా అనేక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

ఏపీ సీఎంగా ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలో మీడియాతో జగన్‌ మాట్లాడారు. తనకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసంతో ప్రజలు ఓటేశారన్న జగన్‌.ప్రజలు విశ్వసనీయతకు ఓటేశారని చెప్పారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మంచి పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమైన అనంతరం ఈ నెల 25 వ తేదీన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. ఆ సమావేశంలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడి ఎన్నుకుంటారు.

మరోవైపు ఏపీ వ్యాప్తంగా వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంజరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి.. స్వీట్లు పంచుకున్నారు. దీంతో దాదాపు సెగ్మెంట్‌లోనూ సంబరాలు మిన్నంటాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *