గెలుపు గ్యారంటీ అంటున్న వైసీపీ

గెలుపు గ్యారంటీ అంటున్న వైసీపీ

మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. గెలుపు గ్యారంటీ అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జగన్ అడుగులేస్తున్నారు. సరిగ్గా కౌంటింగ్‌కు ముందు రోజు కొత్తింట్లో దిగుతున్నారట. అంతేకాదు, ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఫలితాలకు ముందే, వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఏపీలో అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ, అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ గెలిస్తే జగన్ ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఓ జ్యోతిష్కుడు ముహూర్తాన్నికూడా ఖరారు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, అదంతా అవాస్తమవని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇదిలా ఉంటే, జగన్ ఈ నెల 22వ తేదీనాటికి పూర్తిగా అమరావతికి మకాం మారుస్తున్నారు. అంతకుముందే, పార్టీ కార్యాలయం అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. అధికారంలోకి వస్తాననే ధీమాతోనే జగన్ తరలింపు కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇల్లు, పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఫర్నీచర్, ఇతర సామాగ్రి తరలింపు ప్రారంభమయింది.

రాష్ట్ర విభజన తర్వాత కూడా జగన్ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో టీడీపీ తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ, ఆయన మాత్రం హైదరాబాద్‌ వదిలి రాలేదు. అటు జనసేన పార్టీ కూడా అమరావతి కేంద్రంగానే, ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. అభ్యర్థుల ఖరారు కూడా అక్కడే చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారానికి కూడా రోజూ హైదరాబాద్ నుంచి ఏపీలోని నియోజకవర్గాలకు వెళ్లేవారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. చివరికి… పోలింగ్ ముగిసిన తర్వాత కూడా లోటస్‌పాండ్‌లోనే ఉన్నారు. కచ్చితంగా కౌంటింగ్ రోజు నుంచి మాత్రం, ఏపీ నుంచే కార్యకలాపాలు అనే లీక్ ఇచ్చారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలను తాడేపల్లిలోని తన నివాసం నుంచి వీక్షించనున్నారని తెలుస్తోంది.

ఎన్నికల తర్వాత తొలిసారిగా జగన్ తమ పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఈనెల 21న అమరావతిలో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులతో భేటీ కానున్నట్లు సమాచారం. పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు జగన్ పార్టీ తరపున ఎలాంటి అధికారిక సమావేశం నిర్వహించలేదు. మొదటిసారి పార్టీ అభ్యర్థులతో జగన్ మోహన్ రెడ్డి భేటి అవుతుండటంతో..ఈ సమావేశం కాస్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో జగన్ భేటీకి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్‌పైనే జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *