వైయస్ వివేకా కుటుంబానికి పదవుల ఛాన్స్..!!?

వైయస్ వివేకా కుటుంబానికి పదవుల ఛాన్స్..!!?

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విజయానికి కృషి చేసిన వారందరినీ సంతృప్తి పరిచే దిశగా పయనిస్తున్నారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులకు రాజ్యాంగ పరిధిలోని పదవులను ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి సొంతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి… జగన్ వెన్నంటే ఉన్నారు. మధ్యలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా వైయస్ వివేకానంద రెడ్డి మాత్రం తన అన్న కుమారుని చేయి వదలలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కడప జిల్లాలో విజయం సాధించేందుకు వివేకానంద రెడ్డి అహర్నిశలు పాటుపడ్డారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యను సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పై నెట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. ఈ కేసులో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తన ఘన విజయం కోసం కష్టపడుతున్న బాబాయ్ వివేకానంద రెడ్డి కి తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పదవి ఇస్తారని పార్టీలో అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అనుకోని సంఘటనతో వివేకానంద రెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో ఆయనకు ఇవ్వాలనుకున్న పదవి ఆయన కుమార్తెకు గానీ, లేదూ ఆ ఇంట్లో వారు సూచించిన ఇంకెవరికైనా ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె చదువుకున్నవారు. ఆమె వైద్య వృత్తిలో ఉన్నారు. దీంతో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కానీ, శాసనమండలి సభ్యత్వం కాని ఇవ్వవచ్చునని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ రెండూ కాకపోతే వైద్యవిధాన పరిషత్ వంటి కీలక కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా తమను నమ్ముకున్న వారిని, తమ కోసం కష్టపడిన వారిని వైయస్సార్ కుటుంబం గుండెల్లో పెట్టుకుంటుందన్న భరోసాను ఇచ్చినట్లుగా అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *