మీరు ఇరవై...మేము నూటయాభై!

మీరు ఇరవై...మేము నూటయాభై!

సీనీయర్ వర్సెస్ జూనియర్…అనుభవంతో తలపడుతున్న ఆవేశం…ప్రస్తుతం ఏపీ శాసనసభా సమావేశాల్లో జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చిన కొత్త నాయకత్వం ఉత్సాహంలో జగన్ ఉంటే, మరోవైపు తొలిసారి ఘోర పరాజయాన్ని మోస్తున్న చంద్రబాబు టీమ్…బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య యుద్ధ వాతారవరణం నడుస్తోంది. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ…ఒకరికొకరు వార్నింగ్ ఇస్తూ సభను వీధి బాగోతంగా మార్చేసిన పరిస్థితి ఉంది. అయితే..ఈ గందరగోళంలో జగన్ పేల్చిన మాటల తూటా పెద్ద సంచలనాన్ని రేపింది.

ఏమీ చేయకుండా చెప్పుకునే బాపతు!

సున్నా వడ్డీ ఋణాలపై జరుగుతున్న చర్చలో గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ..చంద్రబాబు, వారి సభ్యులపై విరుచుకుపడ్డారు. తానేదో గొప్ప పథకాలు అమలు చేసినట్టు చంద్రబాబు అభిప్రాయపడుతున్నారని..ఆయన ప్రసంగాలు మొదటిసారి విన్నవారికి గొప్పగా ఉంటాయంతే అంటు సెటైర్ వేశారు. వడ్డీలేని ఋణాలపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తరపున తీసుకొచ్చిన కాగితాన్ని జగన్ సభలో చదివిని వినిపించారు. ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం రూ. 11,595 కోట్లు చెల్లించాల్సి ఉంటే…కేవలం రూ. 630 కోట్లు మాత్రమే చెల్లించింది అని సీఎం చెప్పారు. లెక్కలతో సహా జగన్ వివరాలను చదివి వినిపించారు. 2014-15లో రూ.1186 కోట్లకు చెల్లించాల్సి ఉంటే రూ.44.31 కోట్లు చెల్లించి గొప్పగా చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే 2015-16లో రూ.2238 కోట్లు కట్టాల్సి ఉండగా రూ.31 కోట్లు చెల్లించారు.. 2016-17లో రూ.2,354 కోట్లకు రూ.249 కోట్లు, 2017-18లో రూ.2703 కోట్లకు రూ.182 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. 2018-19లో రూ.3069 చెల్లించాల్సి ఉంటే రూ.122 కోట్లు మాత్రమే చెల్లించారని, ఐదేళ్లలో మొత్తం రూ.630 కోట్లు చెల్లించి గొప్పగా చేసినట్టు చెప్పుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు.

జగన్ కోపం…

ఈ సమయంలో సీఎం జగన్ ప్రసంగానికి టీడీపీ నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీనిపై సీఎం జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మీరు 23 మందే ఉన్నారు, మేము 151 మంది సభ్యులమని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మేమంతా లేస్తే మీ స్థానాల్లో మీరు కూర్చోలేరని ఆగ్రహించారు. మేం తలుచుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరని అన్నారు. ప్రతిపక్షం బుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని, పర్సనాలిటీ పెరడగం కాదు..బుర్ర పెంచుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో గూండాలను, రౌడీలను తీసుకొచ్చారని జగన్ మండిపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *