మంత్రివర్గంలో రోజాకు నో ప్లేస్

మంత్రివర్గంలో రోజాకు నో ప్లేస్

సామాజిక సమీకరణాలే ఆమె పదవికి శాపంగా మారాయి. ఐరెన్ లెగ్ గా అప‌వాదులు ఎదుర్కొని, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శలు త‌ట్టుకుని వైఎస్ఆర్‌సీపీకి అన్ని వేళ‌లా అండ‌గా నిలిచారు..ప్రత్యర్థులకు త‌న మాట‌ల తూటాల‌తో ముచ్చెమ‌టలు పోయించి..ఎమ్మెల్యేగా మ‌రోసారి గెలిచి త‌న స‌త్తా ఏమిటో చూపించిన రోజా సెల్వమ‌ణికి జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు ద‌క్కలేదు.మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న రోజాకు నిరాశే ఎదురైంది.సామాజిక సమీకరణాలే ఆమె పదవికి శాపంగా మారాయి.

ఏపీ మంత్రివర్గ కూర్పు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 25 మందికి జగన్‌ తన జట్టులో చోటు కల్పించారు. అందులో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఐతే, ఆజట్టులో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు, కేబినెట్‌లో పెద్ద పోస్టే దక్కుతుందని మొదటి నుంచి ఊహాగానాలు వినిపించాయి. చివరికి ఆ జాబితాలో పేరు లేకపోవడం గమనార్హం.

రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం పట్ల సొంత పార్టీ నేతలతో పాటు, విప‌క్షాలు సైతం విస్మయానికి గుర‌య్యాయి. టీడీపీని వీడి వైసీపీలో చేరాక, రోజా జగన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2014లో నగరి నుంచి గాలి ముద్దుక్రిష్ణమనాయుడుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. 2019 ఎన్నికల్లోనూ మరోసారి నగరి నుంచి పోటీ చేసి విజయబావుటా ఎగరవేశారు. దీంతో, ఎవ‌రేమో గానీ, రోజాకు మాత్రం జగన్ టీంలో బెర్త్ ఖాయ‌మని జోరుగా ప్రచారం జరిగింది. హోంమంత్రి లేదా స్పీకర్ పదవి వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. రోజా కూడా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెంచుకున్నారు. కానీ, ఊహించని పరిణామం ఎదురైంది.

కేబినెట్‌లో సామాజిక స‌మ‌తూకం పాటించిన జ‌గ‌న్ ..రానున్న కాలంలో రోజాకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త‌న‌పై న‌మ్మకంతో గెలిపించిన నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని రోజా స్పష్టం చేశారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడుతానని తెలిపారు. వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజా అనతికాలంలో పార్టీలో కీలక నాయ‌కురాలిగా ఎదిగారు. చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు. ఏడాది కాలం అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఈ పరిణామాలన్నంటి మధ్య రోజా పేరు ఇంటా బయట మారుమోగింది.

చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి మంత్రి పదవులు దక్కించుకున్నారు. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్‌.. మరో రెండున్నరేళ్ల తర్వాతే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. స్వయంగా రెడ్డి సామాజికవర్గమైన జగన్ తన సామాజికవర్గాన్ని దూరం పెట్టడం నిజంగా సాహసోపేత నిర్ణయంగా చెప్పవచ్చు. కేబినెట్‌లో అత్యధికంగా బీసీలకు ఏడు – ఎస్సీలకు ఐదు – రెడ్లు – కాపులకు కేవలం 4 చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. ఈ కారణంగానే రోజాకు మంత్రి పదవి అందకుండా పోయింది.

ప్రస్తుతం పార్టీలో రోజాకు జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పుతారన్నది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఏదైనా పదవి ఇస్తారా లేక రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *