మానవత్వాన్ని చాటుకున్న ఏపీ సీఎం జగన్

మానవత్వాన్ని చాటుకున్న ఏపీ సీఎం జగన్

బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. క్యాన్సర్ రోగికి అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలని ఆదేశించారు. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. జగన్ మానవత్వానికి అందరూ ఫిదా అవుతున్నారు.

ఏపీ సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్న ఘటన విశాఖపట్నంలో జరిగింది. జగన్ శారదాపీఠం సందర్శన కోసం ఈ ఉదయం విశాఖ వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టు వద్ద కొందరు టీనేజర్లు బ్యానర్లతో నిలుచున్నారు. నీరజ్ అనే తమ స్నేహితుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, అతడికి సాయం చేయాలని కోరుతూ బ్యానర్లలో పేర్కొన్నారు. అయితే, జగన్ వైజాగ్ చేరుకున్న సమయంలో ఆ బ్యానర్లను చూడలేదు కానీ, తిరిగి విజయవాడ వెళ్లిపోయే సమయంలో ఆ బ్యానర్‌ సీఎంకు కనిపించింది.

బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ కొందరు యువతీ యువకులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. వారిని గమనించిన సీఎం వైఎస్‌ జగన్ కాన్వాయ్ ను ఆపించి కిందకి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు. ఫ్లెక్సీ గురించి ఆరా తీశారు. తమ స్నేహితుడు నీరజ్ బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నాడని ఆపరేషన్ కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని ఈనెల 30లోగా అతడికి ఆపరేషన్ చేయించకపోతే తమకు దక్కడని వారు ముఖ్యమంత్రి వద్ద బోరున విలపించారు.

స్నేహితుడి కోసం వారు పడుతోన్న ఆవేదన చూసి సీఎం జగన్ చలించిపోయారు. నీరజ్ ఆపరేషన్‌కు వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం మానవత్వానికి నీరజ్ స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *