ఏఎన్‌- 32 విమాన శకలాల ఆచూకీ లభ్యం

ఏఎన్‌- 32 విమాన శకలాల ఆచూకీ లభ్యం

8 రోజులుగా అలుపెరగని అన్వేషణ. పగలూ, రాత్రి అని తెలియకుండా అన్వేషించారు. ఎట్టకేలకు గుర్తించారు. కానీ..ఆ అన్వేషణ విషాదంగా ముగిసింది. కూలిన విమానంలో ఒక్కరూ కూడా మిగిలి ఉండే అవకాశం లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భయంకరమైన కొండల్లో, లోయల్లో కూలిన విమానం భారతజాతికి విషాదాన్ని మిగిల్చింది.

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌–32 రకం విమాన ఆచూకీని ఎంఐ–17 హెలికాప్టర్లు కనుగొన్నాయి. విమాన శ‌క‌లాల‌ను అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని లిపోకి 16 కిలోమీట‌ర్ల దూరంలో కనుగొన్నారు. అయితే విమానంలో ఉన్న సిబ్బంది ప‌రిస్థితి గురించి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్న‌ట్లు ఓ ట్వీట్‌లో ఐఏఎఫ్ తెలిపింది. జూన్‌ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్‌32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే.

అసోంలోని జొర్హాత్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్‌32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *