మహిళల ఓట్లే గాని.. సీట్లు వద్దా...!!?

మహిళల ఓట్లే గాని.. సీట్లు వద్దా...!!?

ప్రతి రాజకీయపార్టీకీ మహిళల ఓట్లు కావాలి. ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడానికి మహిళలే ఆలంబన కావాలి. ఎన్నికల ప్రచారంలో మహిళలను ఆకాశానికి ఎత్తేసే పార్టీలు…. ఎన్నికల క్షేత్రంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నాయి. దీనికి తాజాగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలోనూ అధికార, ప్రతిపక్షాలు మహిళలకు కేటాయించిన సీట్లు చూస్తే… స్త్రీల పట్ల రాజకీయ పార్టీలకు ఉన్న గౌరవం ఏపాటిదో అర్థమవుతోంది. దీనికి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనే మినహాయింపు లేదు. అన్ని పార్టీలూ ఒకే తానులో ముక్కలు గానే ఉన్నాయి. ఈ పార్టీలు మహిళలకు సీట్లు కేటాయించడంలో వివక్ష చూపుతున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలలో నామినేషన్ ఉపసంహరణ అనంతరం మిగిలిన మహిళా అభ్యర్థనను లెక్కిస్తే విషయం తేటతెల్లమవుతోంది.

అన్ని పార్టీలదీ ఒకే తీరు!

మహిళలకు టిక్కట్లు కేటాయించడంలో ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. అన్ని పార్టీలూ ఒకే విధంగా వ్యవహరించాయి. తమ పార్టీ మహిళా పక్షపాతి అని, మహిళలకు తమ పార్టీలో ఎంతో గౌరవం ఉందని చెబుతున్న పార్టీలన్నీ టికెట్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్రసమితి లోక్‌సభ ఎన్నికలలో 17 నియోజకవర్గాలలో కేవలం రెండంటే రెండే సీట్లను మహిళలకు కేటాయించింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాలోతు కవిత టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన వారందరూ పురుషులే. ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ అయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి అవకాశం ఇచ్చింది. అది కూడా పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తరువాత ప్రకటించడం గమనార్హం. ఇక జాతీయస్థాయిలో తమదే మహిళా పక్షపాతి పార్టీ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ కేవలం ఇద్దరు మహిళలకే లోక్‌సభ స్థానాలను కేటాయించింది. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి డీ.కే. అరుణ, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బంగారు శృతి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో జాతీయ పార్టీ సిపిఎం అయితే ఒకే ఒక మహిళకు లోక్ సభ స్థానాన్ని కేటాయించారు. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి సీపీఎం సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం కోడలు మల్లు లక్ష్మికి టికెట్ ఇచ్చారు.

వివక్షలో ఏపీ మినహాయింపు కాదు!!…

లోక్ సభ అభ్యర్థుల ఎంపికలోనూ… టికెట్ల కేటాయింపులోను మహిళలకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అవమానం జరిగింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 25 లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ట్రంలో కేవలం ముగ్గురు మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. రాజమహేంద్రవరం నుంచి మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూప కు టికెట్ ఇచ్చారు. తిరుపతి నుంచి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన పనబాక లక్ష్మికి, రాజంపేట నుంచి డి సత్యప్రభకు టికెట్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురు మహిళలకే టికెట్లు ఇచ్చింది. అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి మాధవి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి డాక్టర్ బీ.వీ. సత్యవతి, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి చింతా అనురాధ, కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి వంగా గీతలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయితే ఒకే ఒక మహిళకు టికెట్ ఇచ్చారు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరికి టిక్కెట్ దక్కింది. తెలుగు రాష్ట్రాలే కాక దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలూ మహిళలకు టికెట్లు ఇవ్వడంలో, అవకాశం కల్పించడంలో వివక్షను చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *