ఆమె 28 ఏళ్ల తర్వాత నిద్రలేచింది!

ఆమె 28 ఏళ్ల తర్వాత నిద్రలేచింది!

మనిషి ఒకరోజులో 8 గంటలు నిద్రపోవాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే…కానీ ఒక మహిళ ఏకంగా 28 ఏళ్లు నిద్రలో ఉంది. నమ్మడం కొంచెం కష్టమైనా ఇది నిజం. మునిరా అబ్దుల్లా అనే ఆమె అన్నేళ్లు నిద్రలో ఉండిపోయారు. నిద్రలో అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో..? ఆమెకు ఏమైందో తెలుసుకుందాం.

1991లో మునిరా తన కారులో ప్రయాణిస్తున్నారు. అయితే…అనుకోకుండా వేగంగా వస్తున్న ఒక స్కూల్ బస్సు ఆమె కారుని ఢీకొట్టింది. కారుపై బస్సు బోల్తా పడటంతో మునిరాకు తీవ్రమైన గాయాలయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆమె కుమారుడు ఒమర్ కూడా ఆమెతోనే ఉన్నాడు. కాకపోతే మునిరా తన కొడుకుని గట్టిగా హత్తుకుని ఉండటంతో ఇమర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కొడుకుని కాపాడే క్రమంలో మునిరా తలకు తీవ్రమైన దెబ్బ తగిలి మెదడు చిట్లింది. ఇక ఆరోజు నుంచి ఆమె కళ్లు తెరవలేదు. కళ్లు తెరవకపోయినా ఆమెకు నొప్పి తెలిసేది. ప్రత్యేక చికిత్స కోసమని ఆమెను లండన్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు సైతం చికిత్స అసాధ్యమని తిరిగి పంపించేశారు. అప్పటి నుంచి ఆమెకు ట్యూబ్‌ల ద్వారానే ఆహారం అందిస్తున్నారు. కండరాలు బిగిసిపోకుండా ఎప్పటికపుడు ఫిజియోథెరఫీ చేస్తూ వచ్చారు. 2017లో అబుదాబి రాజు మహమ్మద్ బిన్ జయేద్ కలంపించుకుని ఆమె వైద్యానికి ఆర్థిక సాయం చేశారు. దీంతో ఆమెను జర్మనీలో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇప్పించారు. ఆ హాస్పిటల్‌లో ఆమెను నిద్ర నుంచి మేల్కొనెలా మందులు ఇవ్వడం మొదలుపెట్టారు.

ఆమె కుమారుడు ఒమర్ మాట్లాడుతూ.. “అమ్మ శరీరంలోని అవయవాలేవీ దెబ్బ తినకుండా చురుగ్గా పనిచేసేలా చికిత్స అందిస్తూ వచ్చారు. ప్రొటీన్స్, మెడిసిన్స్ ఇస్తూ ఆమెలో చలనం వచ్చేలా చేశారు. అప్పటి నుంచి ఆమెలో మార్పు మొదలైంది. 2018, జూన్‌లో ఆమె నోటితో ఏవో శబ్దాలు చేయడం విని కంగారు పడ్డా. కానీ.. వైద్యులు ఆందోళన పడొద్దని చెప్పారు. మూడు రోజుల తర్వాత నిద్రలో ఉన్న నన్ను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే మా అమ్మ నా పేరు కలవరిస్తోంది. దీంతో నా సంతోషానికి అవధుల్లేవు. ఎన్నేళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు అది. పైగా, ఆమె నా పేరునే మొదటిసారిగా కలవరించింది” అని తెలిపాడు.

ఒమర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. “నాకు జరిగిన ఈ ఘటన గురించి మీతో చెప్పుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. మీరు ప్రేమించే వ్యక్తులపై జీవితంలో ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు చనిపోయారనే నిర్ణయానికి రావద్దు. ఇన్నేళ్లుగా వైద్యులు నన్ను ఎంతో నిరాశపరిచేవారు. ఆమెపై ఆశలు పెట్టుకోవద్దని, ఆమె సాధారణ స్థితికి రాదని చెప్పేవారు. కానీ, ఆమె మేల్కోడానికి ఎన్ని మార్గాలైతే ఉంటాయో అన్నీ ప్రయత్నించాను. చివరికి నా ‘అమ్మ’కు నేనే జన్మనిచ్చాను’’ అని ఉద్వేగంతో వెల్లడించాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *