దిగ్విజయ్‌పై ప్రతీకారానికే సాధ్వి పోటీ

దిగ్విజయ్‌పై ప్రతీకారానికే సాధ్వి పోటీ

మ‌ధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ … ఈ సారి భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి ఇప్పటి దాకా భోపాల్ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ గెల్చుకోలేక పోయింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న భోపాల్ సీటును ఎలాగైనా గెల‌వాల‌న్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దిగ్విజ‌య్ సింగ్‌ను చివరి అస్త్రంగా ప్రయోగించింది. అయితే బీజేపీ అదే స్థానంలో తన అభ్యర్థిగా సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను బరిలోకి దించింది. బీజేపీ మొదట మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను నిలబెడదామని భావించింది. కానీ మాలెగాం పేలుళ్లలో నిందితురాలై, జైలు శిక్ష అనుభవించిన సాధ్వీ పేరును ఆరెస్సెస్‌ బలంగా ప్రతిపాదించింది. దీంతో బీజేపీ సాధ్వీని పోటీలో నిలబెట్టింది.

దిగ్విజయ్‌ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతోనే ఆరెస్సెస్‌ సాధ్వీనినిలబెట్టాలని కోరింది. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్లు, మాలెగాం పేలుళ్లు వెనుక సంఘ్‌-అనుకూలవాదులే ఉన్నారని దిగ్విజయ్‌ పదేపదే ఆరోపించారు. 26/11 ముంబై ఉగ్రదాడికీ హిందూత్వ సంస్థలే కారణమని, ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కారేను కాల్చి చంపినది హిందూ ఉగ్రవాదులేనని అప్పట్లో ఘాటుగా ఆరోపణలు సంధించారు. 26/11 ఆరెస్సెస్‌కీ సాజీషీ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దిగ్విజయ్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు సంఘ్‌ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసింది. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని సంఘ్‌ భావిస్తోంది.

సాధ్విని గెలిపించడం ద్వారా హిందూ ఉగ్రవాద ముద్రను చెరిపేయ్యాలని సంఘ్‌ భావిస్తోంది. ఆరెస్సెస్‌ ఆలోచనలను బీజేపీ నేతలు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. హిందూ మతానికి ఉగ్రవాదాన్ని అంటగట్టి, హిందూ మతాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి కాంగ్రెస్‌ పన్నిన కుట్ర అని.. ఆ కుట్రకు రూపమే దిగ్విజయ్ అని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా హిందూ టెర్రర్‌ అనే పదాన్ని కోర్టులే తప్పుపట్టాయని అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. తమను కించపరిచేలా వ్యవహరించిన దిగ్విజయ్‌కు పోటీగా … ఆనాడు బాధలు అనుభవించిన సాధ్విని నిలబెట్టామని చెప్పారు.

అటు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ బీజేపీ సూచనలకు అనుగుణంగానే తన ప్రచారాన్ని ఆరంభించారు. భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో తొలుత మాట్లాడిన ఆమె మాలెగాం పేలుళ్ల ఘటనను ప్రస్తావించారు. ఆ కేసులో తానను జైల్లో ఎలాంటి చిత్ర హింసలు పెట్టారో చెప్పారు. తనకు నార్కో, పాలిగ్రాఫ్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్ వంటి పరీక్షలు చేశారన్నారు. ఇలాంటి పరీక్షల కోసం వాడిన రసాయనాల వల్ల తనకు కేన్సర్ వచ్చిందని తెలిపారు.

దిగ్విజయ్‌ సింగ్‌ను భోపాల్‌ నుంచి పోటీ చేయడం వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. త‌న‌ను ఓడించ‌డానికి ఆ రాష్ట్ర సీఎం క‌మ‌ల్ నాథ్ ప్లాన్ చేస్తున్నట్లు డిగ్గీరాజా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ సీటు నుంచి దిగ్విజ‌య్ గెలిస్తే, త‌న సీఎం కుర్చీకి ఆయ‌న ఎస‌రు పెడ‌తార‌న్న భ‌యం క‌మ‌ల్ నాథ్‌కు ప‌ట్టుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దిగ్విజయ్‌ తన గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్ని రకాల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఫోటోలను నెట్లో పెడున్నారు. భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లలో 69 శాతం హిందువులు, 26% ముస్లింలు ఉన్నారు. అయితే మెజారిటీ ఓట్లు తమకే అంటూ గెలుపుపై ధీమాతో ఉన్నారు కమలనాథులు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *