ఫలితాల తర్వాత టీ కాంగ్‌లో మార్పులు!

ఫలితాల తర్వాత టీ కాంగ్‌లో మార్పులు!

ప్రతి ఎన్నికలనూ ఫెయిల్యూరే. దీంతో, పార్టీ నేతల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లింది. గెలిచిన కొద్ది పాటి ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం మంది ఇప్పటికే చేజారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై ఇంటా బయట విమర్శలు తీవ్రమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో సమూల మార్పులుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఆయన పదవి ఉంటుందా? ఊడుతుందా?లేక స్వతహాగా తప్పుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఎమ్మెల్యేల ఫిరాయింపులు టీపీసీసీ నాయకత్వం ఫెయిల్యూర్‌ను చెప్పకనే చెబుతున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పని తీరు.. సొంత పార్టీ నేతల్ని కూడా నిరాశకు గురి చేస్తోందట. వ్యతిరేక వర్గమే కాదు, తన వర్గం అనుకున్న వారు కూడా …అసమర్థ నాయకుడిగా ముద్రవేయడం ఉత్తమ్‌ను ఆవేదనకు గురిచేసిందట. ఈ పరిస్థితుల్లో పీసీసీ నుంచి వైదొగలడమే ఉత్తమం అని ఉత్తమ్ ఆలోచనకు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే చాలా మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మిగిలినవారిలో కొందరు గులాబీ దళంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనికంతటికి పీసీసీ రాష్ట్ర నాయకత్వమే కారణమన్న విమర్శలున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోయే నేతలను ఉత్తమ్ నిలవరించే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఈపరిస్థితి ఏర్పడిందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్న పరిస్థితి. ఏ ఒక్క పనిని ఉత్తమ్ వ్యూహాత్మకంగా అమలు చేయలేకపోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు. రాహుల్ గాంధీ నమ్మకాన్ని కూడా కోల్పోవడంతో ఆయన పోస్ట్‌ ఊస్టింగేనన్న టాక్ నడుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పుడే, ఉత్తమ్‌ను తొలగించాలంటూ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా, రాహుల్ ఉత్తమ్‌పై నమ్మకం ఉంచి, లోక్ సభ ఎన్నికల బాధ్యతలను అప్పజెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే, ముందే తొలగిపోతే మంచిదన్న ఆలోచనలో ఉత్తమ్ ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు రావాలంటే, ఉత్తమ్‌ను మార్చాలన్న డిమాండ్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ పరిణామాలన్నంటి మధ్య, ఉత్తమ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఉత్తమ్ ఇప్పటికే నాలుగేళ్ల పదవికాలన్ని పూర్తి చేసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికల ఫలితాలని జీర్ణించుకోలేక పోతున్న అధిష్టానం పెద్దలు, పార్లమెంట్ ఫలితాల తర్వాత టీ కాంగ్రెస్‌లో సమూల మార్పులు ఖాయమని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *