సర్వేలు నిజమవుతాయా !? మోదీ వ్యతిరేకులలో అందోళన

సర్వేలు నిజమవుతాయా !?  మోదీ వ్యతిరేకులలో అందోళన

కేంద్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా..? ప్రధాన మంత్రిగా మళ్ళీ నరేంద్ర మోదీయే అధికార పగ్గాలు చేపడతారా…. అదే వాస్తవమైతే తమ పరిస్ధితి ఏమిటని భారతీయ జనతా పార్టీలో ఉన్న మోదీ వ్యతిరేక వర్గం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఆదివారం జాతీయ మీడియాతో పాటు కొన్ని ప్రవేటు సంస్థలు వెల్లడించిన సర్వేలలో భారతీయ జనతా పార్టీకి అప్రతిహత విజయం దక్కుతుందని తేలింది.

ఇది కమలనాథులలో ఎక్కువ మందికి ఆనందాన్ని కలిగించినా మోదీ వ్యతిరేక వర్గీయులకు మాత్రం ఆశనిపాతంలా మారిందంటున్నారు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశంగా వ్యవహరించారని, తిరిగి మరోసారి ఆయన ప్రధాని అయితే పార్టీ సిద్దాంతాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తారని వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.  గడచిన ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలలోనూ, పార్టీలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమయిందంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రధానిగా తిరిగి నరేంద్ర మోదీయే వస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఆయన వ్యతిరేక వర్గీయులు అంటున్నారు.

కేంద్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి రావాలని, ప్రధానిగా నరేంద్ర మోదీ రాకూడదన్నది ఆయన వ్యతిరేకుల ఆలోచన. ఈ ఎన్నికలలో బొటాబొటీగా బిజేపీకి సీట్లు వస్తే మిత్రుల సాయంతో అధికారంలోకి రావచ్చునని, అప్పుడు ప్రధానిగా వేరొకరిని ప్రతిపాదించవచ్చునని మోదీ వ్యతిరేక వర్గీయులు భావిస్తున్నారు. ఇలా జరిగితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ప్రధాని అభ్యర్దిని మార్చాలన్న డిమాండ్  తెరపైకి తీసుకువస్తుందని ఆశించారు. ఆదివారం నాడు వెల్లడైన సర్వే ఫలితాలు నిజమైతే మాత్రం నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం మరోసారి చక్రం తిప్పే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *