అజార్‌పై ఆంక్షలు అమలవుతాయా?

అజార్‌పై ఆంక్షలు అమలవుతాయా?

ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఎట్టకేలకూ ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది. కానీ దీని మీద భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మసూద్‌కు ఆశ్రయమిచ్చిన దేశాల మీద విధించే ఆంక్షలు కచ్చితంగా అమలైతేనే ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఎన్నో ప్రయత్నాల తరువాత గానీ మసూద్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించే విషయంలో చైనా మెత్తబడలేదు. ప్రస్తుతం మసూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడు. అతని మీద చర్యలు తీసుకోవడంలో ఆ దేశం నిజాయితీగా వ్యవహరిస్తుందా…? అన్నది అనుమానమేనని అంటున్నారు.

అలా ప్రచురించాయి…

భారత్‌లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నందున మసూద్ మీద నిషేధాన్ని కొంత కాలం పాటు వాయిదా వేయాలని పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితిని వేడుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి తెర వెనుక నుంచి చైనా కూడా మద్దతు పలికి ఉండవచ్చని కొన్ని ఇంగ్లిషు పత్రికలు ప్రచురించాయి. కానీ చివరకు ప్రకటన మాత్రం వచ్చేసింది. దీని మీద ప్రధాని నరేంద్రమోడీతో పాటు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, ఇందులో మీ ఘనతేమీ లేదని మోదీని ఎత్తిపొడిచింది.

బాంబుతో పెట్టిన విద్య…

వర్తమాన ఉగ్రవాద నేతల్లో మసూద్ అత్యంత ప్రమాదకారి అనడంలో సందేహం లేదు. మనుషుల ప్రాణాలు తీయడమనేది అతడికి బాంబుతో పెట్టిన విద్య. భారత్‌కు వ్యతిరేకంగా నరనరానా వ్యతిరేకతను జీర్ణించున్న వ్యక్తి. అంతర్జాతీయ సమాజానికి భయపడో, లేక నిషేధం వల్ల వచ్చే ఆంక్షలకు తలవంచో పాకిస్థాన్ ప్రభుత్వం మసూద్ మీద కొన్ని చర్యలకు సిద్ధపడవచ్చు. కానీ, అక్కడి సైన్యం, సైనికాధికారులు దీనిని ఎంతవరకూ పడనిస్తారో అనుమానమేనని పలువురు చెబుతున్నారు. ఇంతకు ముందు ఒసామా బిన్ లాడెన్‌కు అక్కడి సైన్యం రక్షణ కవచంగా నిలిచిన విషయాన్నీ, అమెరికా… పాకిస్థాన్ లోకి రహస్యంగా ప్రవేశించి లాడెన్‌ను పకడ్బందీగా హతమార్చిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. మసూద్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పాకిస్థాన్ వెనుకాడితే, అమెరికా చేసిన సాహసాన్ని భారత్ కూడా చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కశ్మీర్ సమస్య రోజురోజుకూ మరింత సున్నితంగా మారుతోంది. అక్కడి ప్రజాస్వామిక నేతలూ ఒక్కోసారి విచిత్రంగా మట్లాడుతున్నారు. ఈ తరుణంలో దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *