తెలంగాణలో బలోపేతంపై బీజేపీ దృష్టి!

తెలంగాణలో బలోపేతంపై బీజేపీ దృష్టి!

అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన తెలంగాణ బీజేపీకి, ఇంటర్మీడియట్ ఇష్యూపై చేసిన పోరాటంతో కొంత చలనం వచ్చింది. ప్రజాసమస్యలే అజెండాగా ఉద్యమాలకు సై అంటున్నారు కమలనాథులు. మరోసారి, కేంద్రంలో వచ్చేది మోదీ సర్కారేనని…రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో కమలనాథులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రిజల్ట్‌కు ముందు వచ్చిన ప్రీపోల్స్ సర్వే ఫలితాలు, మరోసారి బీజేపీదే అధికారమని తేల్చేశాయి. 300 సీట్లకు పైగానే గెలిచి మోదీ మళ్ళీ అధికారాన్ని చేపడతారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక, తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు, రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటర్మీడియట్ ఇష్యూలో తాము చేసిన పోరాటంతో ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని, ఇక ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని కమలనాథులు చెబుతున్నారు. ప్రజా పోరాటాలు, ఉద్యమాల ద్వారా రాష్ట్రంలో బలపడాతమని అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోయిందని, టీడీపీ అడ్రెస్ గల్లంతయిందని…. ఇక తెలంగాణలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఈసారి బీజేపీకి సీట్లు, ఓట్లు పెరుగుతాయని కమలనాథులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా పలు సంచలన మార్పులు వస్తాయని చెబుతున్నారు. పలు పార్టీల నుండి కీలక నేతలు బీజేపీలోకి రావడానికి క్యూ కడతారని అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పోకడలపై రాజీలేని పోరాటం చేస్తున్నామన్న కాషాయ నేతలు… ఇంటర్మీడియట్ వ్యవహారంలో బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపబోమంటున్నారు.

బీజేపీ నాయకత్వం ప్రజాసమస్యలపై పెద్దగా పోరాడదన్న వాదనను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. మరి ఈసారైనా బీజేపీది ఆరంభ శురత్వమో లేదా ఐదు సంవత్సరాల దాకా ఇదే జోరు కొనసాగిస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *