ఇంకా మిగిలున్న లేకి మగబుద్ధి... మహిళల అండర్‌వేర్‌ ఉద్యమం

ఇంకా మిగిలున్న లేకి మగబుద్ధి... మహిళల అండర్‌వేర్‌ ఉద్యమం

మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో మగవాళ్లెలా నిర్ణయిస్తారు. మగవాళ్లు తమ బుద్ధిని మార్చుకోవాలి కానీ, నిగ్రహాన్ని అదుపులో పెట్టుకోకుండా ఆడవాళ్ల ప్రవర్తన గురించి ఎందుకు మాట్లాడుతారు. స్వతంత్రతను సాధిస్తున్న ఈ తరంలో మగవాళ్లు తమ అధిపత్యాన్ని పోగోట్టుకోవడం ఇష్టం లేక ఇలా ఆడవాళ్లపై మానసిక దాడిని చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు జీవించే హక్కు ఉంటుందని మర్చిపోతున్నారు. మగవాడు ఏం చేసినా ప్రశ్నించకూడదు…కానీ ఆడవాళ్లు ఇలాగే ఉండాలి అంటూ పితృస్వామ్య భావజాలాన్ని మళ్లీ మళ్లీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బద్దలు కొట్టడానికే ఈ మధ్య ఆడవాళ్లు సంఘటితంగా పోరాడుతున్నారు. దీన్ని అంగీకరించలేని కొందరు బహిరంగంగానే తమ లేకి బుద్ధిని బయటపెడుతున్నారు.

మగవాళ్లు బుద్ధి మార్చుకోవాలి…

ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఆడవాళ్లు నైటీలు వేసుకోకూడదని జరిమానా విధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి ఆ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడానికి మోజో టీవీ యాంకర్ నైటీ ధరించి వార్తను అందించింది. దీన్ని ఓర్చుకోలేని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తన మగబుద్ధిని బయటపెట్టాడు. నైటీ గురించి న్యూస్ కాబట్టి నైటీ వేసుకుంది, రేప్ గురించి న్యూస్ అయితే రేప్ చేయించుకుంటారా అంటూ నీచంగా పోస్ట్ పెట్టాడు. మహిళలు స్వేచ్ఛగా జీవించడాన్ని భరించలేని వాళ్లే ఇలా ప్రవర్తిస్తారు. తమలో ఇంకా మిగిలున్న పితృస్వామ్యాన్ని బయటపెట్టి అభాసుపాలు అవుతున్నారు. అలాంటి సంఘటనే ఒకటి ఐర్లాండ్‌లో జరిగింది. దాని గురించి తెలుసుకుందాం…

this is not consent

లాయర్ మాటతూలి…

ఐర్లాండ్‌లో 17 ఏళ్ల అమ్మాయిపై అఘాయిత్యం జరిగింది. ఈ కేసులో నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు విచారణలో ఉన్నపుడు డిఫెన్స్ లాయర్ వాగిన చెత్త మాటలు అక్కడి సోషల్ మీడియాని ఒక కుదుపు కుదిపేస్తోంది. కోర్టులో డిఫెన్స్ లాయర్ మహిళల అండర్‌వేర్ చూపిస్తూ ” ఈ అమ్మాయి ఎలాంటి దుస్తులు వేసుకుందో మీరే చూడండి. ఇటువంటి దుస్తులు వేసుకుని అతన్ని రెచ్చగొట్టింది ” అని వాదించారు. ఒక లాయర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆ దేశంలోని మహిళలకు చీదర పుట్టింది. ఆఖరికీ ఆ దేశ మహిళా ఎంపీ రూత్‌ కాపింజ‌ర్‌ పార్లమెంట్ సభలో అండర్‌వేర్ ప్రదర్శించి నిరసన తెలిపారు. సాక్షాత్తు ఎంపీనే నిరసన తెలపడంతో….ఐరిష్ మహిళా లోకం ఈ నిరసనలో తమవంతుగా అండర్‌వేర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ThisIsNotConsent…అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఉద్యమం నడుస్తోంది. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటే వారికెందుకు? మగవారి బుద్ధి…దుస్తులను బట్టి మారుతుందా? అంటూ ఆగ్రహాన్ని పకటిస్తున్నారు. దుస్తులను బట్టి శృంగారానికి అనుమతి తెలిపినట్టు కాదు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

this is not consent

ఇప్పటికైనా..!

ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా మొత్తం వారికి మద్దతుగా అండర్‌వేర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ మగవాళ్లు బుద్ధిని మార్చుకోవాలి కానీ ఆడవాళ్ల దుస్తుల గురించి మాట్లాడకూడదు అంటున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *