రాయచోటిలో గెలిచే రెడ్డి ఎవరు?

రాయచోటిలో గెలిచే రెడ్డి ఎవరు?

ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యమే. ఒకరు హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదుంటే..మరొకరు వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ, ఈసారి అక్కడ పరిస్థితులు మారిపోయాయట. మారిన పరిణామాలు తమకే అనుకూలమని టీడీపీ అంటుంటే…నాలుగోసారి తనదే విజయమన్న ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతకీ, రాయచోటిలో గెలిచే రెడ్డి ఎవరు?

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి రాజకీయంగా ఓ ప్రత్యేకత ఉంది. ఈసారి ఇక్కడ భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపుపై టీడీపీ, మెజారిటీపై వైసీపీ లెక్కల్లో మునిగిపోయాయి. వైసీపీ నుండి గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నుండి రమేశ్ రెడ్డి రాయచోటి బరిలో నిలిచారు. రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటికే హాట్రిక్ కొట్టిన గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఈసారి భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. రమేశ్ రెడ్డి కూడా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారు. అభ్యర్థుల నమ్మకం అలా ఉంటే….ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు మాత్రం ఉత్కంఠను భరించలేకున్నారు.

రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 31వేల పై చీలుకు ఓటర్లున్నారు. ఈసారి 79శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చితే మునిసిపాలిటీలో పోలింగ్‌ శాతం తగ్గింది. రాయచోటిలో పోటీ పడిన అభ్యర్థులు ఇద్దరూ రాజకీయ వారసులుగా వచ్చిన వాళ్లే. గడికోట మోహన్‌రెడ్డి వారసునిగా శ్రీకాంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికలు, 2012 ఉప ఎన్నికలు, 2014 ఇలా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్ ఫ్యామిలీకున్న ఇమేజ్‌ తో..ఈసారి బంపర్ మెజారిటీ వస్తుందని గడికోట విశ్వసిస్తున్నారు.

రాజగోపాల్‌రెడ్డి వారసునిగా వచ్చిన రమేశ్‌ రెడ్డి, 1999లో లక్కిరెడ్డిపల్లె నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వరుస ఓటములు చవిచూశారు. ఈసారైనా గెలుపొందాలన్న లక్ష్యంతో బరిలో దిగారు. సంక్షేమ పథకాలపైనే రమశ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌, జనసేన తరపున ముస్లిం మైనార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీళ్లు కొంత మేర ఓట్లు చీల్చినట్లు అంచనా.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *