ఉభయ "గోదావరి"... ముంచేదెవరిని..!

ఉభయ "గోదావరి"... ముంచేదెవరిని..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆర్థికంగానూ పరిపుష్టంగా ఉండే ఈ ఉభయగోదావరి జిల్లాల ప్రజలు రాజకీయంగానూ ఎంతో పరిణతితో ఆలోచిస్తారు. ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కితే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీ. ఈ విషయం గతంలో అనేకసార్లు నిరూపితమైంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రెండు జిల్లాల నుంచి గెలిచిన స్థానాలే కారణం. ఆ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో సగానికి పైగా స్థానాలు తెలుగుదేశం పార్టీ పరం అయ్యాయి. ఇతర జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు అధిగమించాలంటే ఉభయ గోదావరి జిల్లాలలో ఫలితం రాబట్టుకోవడం ఒక్కటే మార్గమని అన్ని పార్టీల ఆలోచన. ఈ రెండు జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం కోసం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శతవిధాలా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలతో రాజకీయ అరంగ్రేటం చేసిన పవన్ కల్యాణ్ ఆశలు కూడా ఉభయ గోదావరి జిల్లాలపై పెట్టుకున్నారు. దీనికి కారణం పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉభయ గోదావరిల్లో ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ సగం స్థానాల్లో ఫలితాల ప్రభావితం చేసేది ఆ సామాజిక వర్గమే.

ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యే పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో జరిగింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. గత ఎన్నికలలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు ఈసారి దక్కే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉభయగోదావరి జిల్లాల్లో వచ్చిన స్థానాలతోనే అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న మంత్రులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఉదయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలున్నాయి. వీటిలో సగానికి పైగా ఎవరి పక్షం వస్తాయో వారే అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉభయ గోదావరి ఏ పార్టీని ముంచేస్తుందో. ఎవరికి పట్టం కడుతుందోనని తెలుగు ప్రజలంతా ఓపికగా ఎదురు చూస్తున్నారు..!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *