ఏపీలో రాజకీయ నిరుద్యోగం...!

ఏపీలో రాజకీయ నిరుద్యోగం...!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభలకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు తేలడానికి మరో నెలరోజులు నిరీక్షించాల్సి వుంది. మే 23న వచ్చే ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు రాజు…? ఎవరు పేద…? ఎవరు విజేత..? ఎవరు పరాజిత…? తేలిపోతుంది. ఈసారి తిరిగి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా పని చేసింది. వస్తామో…? రామో..? కూడా తెలియని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మధ్యేమార్గంగా ఎన్నికల బరిలో నిలిచింది. ఈ మూడు పార్టీల బలాబలాల మధ్య అధికారం ఊగిసలాడుతోంది. ఇక్కడి వరకు కథ అందరికీ అనుకూలంగానే ఉంది.

అసలు కథ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రారంభం అవుతుంది అంటున్నారు. మే 23 తర్వాత వచ్చే ఫలితాలతో ఒక పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. మిగిలిన పార్టీలు ప్రతిపక్షంలో కూర్చుంటాయి. ఇక ఓటమి చెందిన వారు ప్రజా క్షేత్రం నుంచి తప్పుకుంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.

గడచిన నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హడావుడి చేసిన నాయకులు, వారి అనుచర గణానికి మే 23 తర్వాత పెద్దగా పని ఉండదు. వారు నమ్ముకున్న పార్టీ అధికారంలోకి వస్తే పదవుల పందారం ఉంటుంది. అలా కాని పక్షంలో రాజకీయ నిరుద్యోగులుగా మారిపోతారు. ఏ పదవి లేకుండా, ప్రజలలో గుర్తింపు లేకుండా రాజకీయ నిరుద్యోగులుగా చలామణి కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఆలోచనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు మింగుడు పడడం లేదు. తాము నమ్ముకున్న పార్టీ అధికారంలోకి వస్తుందని, తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని కోటి ఆశలు పెట్టుకున్న నాయకులకు ఎన్నికల ఫలితాల అనంతరం నిరాశ ఎదురవుతుందని అంటున్నారు. ఇది ఆ పార్టీకి… ఈ పార్టీకే… అని కాకుండా అధికారంలోకి రానీ పార్టీలకు, ఓటమిపాలైన అభ్యర్థులకు తప్పని పరిస్థితి అంటున్నారు. వారంతా మరో అయిదేళ్లపాటు రాజకీయ నిరుద్యోగులుగా కొనసాగే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కొందరు నాయకులు పార్టీలు మారి అధికార పార్టీలో చేరినా మిగిలిన వారు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఐదేళ్ల పాటు ఖాళీగా ఉండాలని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *