టీడీపీలో చంద్రబాబు తర్వాత నెం.2 స్థానం ఎవరిది? లోకేశ్ తప్పుకున్నట్టేనా!?

టీడీపీలో చంద్రబాబు తర్వాత నెం.2 స్థానం ఎవరిది? లోకేశ్ తప్పుకున్నట్టేనా!?

ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కొంత అనిశ్చితి ఏర్పడింది. ఫలితాల మాటెలా ఉన్నా…ఓటమికి గల కారణాలను పరిశీలించడానికే ఇన్నాళ్ల సమయం వృధా అయింది. ఇప్పటికీ స్పష్టమైన కారణాలను పొందుపరచడంలో జిల్లా స్థాయిలోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే..అసెంబ్లీ సమావేశాల అనంతరం మరో కొత్త వాదన టీడీపీలో చర్చకు వచ్చింది. అదే…పార్టీలో నెం.2 స్థానం గురించి. టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిదే…అయితే…ఇన్నేళ్లలో పార్టీలో నెంబర్ 2 మాత్రం ప్రతి ఎన్నికలకు తర్వాత మారుతూ వచ్చింది. గతంలో మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్…ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి…ఇలా ఎప్పటికపుడు మారుతూ వచ్చారు. అధికారికంగా వీరి పేర్లు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో వీరి మాట చాలా ప్రభావం చూపించేది. అనధికారికంగా వీరే నెంబర్ 2 గా పార్టీలోనీ జిల్లా నేతలు, కార్యకర్తలు భావించేవారు.

బాబు కంటే మెరుగ్గా…
తొమ్మిదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లుగా టీడీపీలో నెంబర్ 2 స్థానంలో చంద్రబాబు కుమారుడు, ఏపీ మాజీ మంత్రి లోకేశ్ ఉంటూ వచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చంద్రబాబు తర్వాత స్థానం లోకేశ్‌దే. పరిస్థితులు మారిన కారణంగా టీడీపీలో నెంబర్ 2 ఎవరిదనే ప్రశ్న మొదటికొచ్చింది. ప్రస్తుత అసెంబ్లీలో టీడీపీ ఉపనేతగా ఉన్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు టీడీపీలో నెం. 2 స్థానంలోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, అసెంబ్లీలో చంద్రబాబుకు మించి వైసీపీ రాజకీయ విమర్శలను తట్టుకుని టీడీపీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కారణంగానే రాబోయే ఐదేళ్ల వరకూ టీడీపీలో నెం.2 స్థానం అచ్చెన్నాయుడిదే అనే ప్రచారం మొదలైంది. ఇక కొందరి వాదన మాత్రం…అసెంబ్లీలో నెం.2 అచ్చెన్నాయుడే అయినా..పార్టీలో మాత్రం నెం.2 స్థానం లోకేశ్‌దే అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీలో టీడీపీ తరపున బలంగా గొంతుని వినిపిస్తున్న అచ్చెన్నాయుడే భవిష్యత్తులో టీడీపీ నెం.2 స్థానంలోకి వస్తారా అనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *