చంద్రబాబు రాజీనామా చేస్తారా? అంటూ జగన్‌ సవాల్‌

చంద్రబాబు రాజీనామా చేస్తారా? అంటూ జగన్‌ సవాల్‌

మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో తొలి రోజు అసెంబ్లీ హోరెత్తింది.

తొలిరోజు ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులు, కరువు అంశాలపై అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లడాన్ని టీడీపీ తప్పుబట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే సీఎం ఎలా అటెండ్ అవుతారని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చిన సీఎం కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్‌ల మాదిరిగా మారే అవకాశం ఉందని గతంలో జగన్ నిరసన తెలిపారని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో కేసీఆర్‌ను జగన్ హిట్లర్‌తో పోల్చిన విషయాన్ని సైతం చంద్రబాబు సభలో ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉన్నందున సీఎం జగన్ వ్యతిరేకించకపోవచ్చు కానీ భవిష్యత్తులో గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు తెలంగాణ రాష్ట్రం అంగీకరించకపోతే ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యపై చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు సున్నా వడ్డీ పథకం కొత్తదేమీ కాదని వ్యాఖ్యానించడంతో సభలో దుమారం చెలరేగింది. గతంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రవేశపెట్టగా తమ ప్రభుత్వం సైతం దాన్ని కొనసాగించిందని చెప్పడంతో సభలో యుద్ధ వాతావరణం కనిపించింది. నిమ్మల రామ నాయుడు వ్యాఖ్యలపై సీఎం జగన్‌ స్పందించారు. టీడీపీ విమర్శలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని సవాల్‌ విసిరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర రైతాంగానికి గత టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదని.. అవసరమైతే రికార్డులు తీసుకొస్తానన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డిపై సభాహక్కుల సంఘానికి వెళ్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీలో తమ వెర్షన్ వినకుండానే ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించిందన్న బాబు… తమకు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేశారని ఆరోపించారు. రాష్ట్రానికి KCR సీఎంగా.. జగన్ డిప్యూటీ సీఎంగా బయట మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు.మొత్తానికి.. మొదటిరోజు అసెంబ్లీ సమావేశం ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *