దాహంతో అల్లాడుతున్న విశాఖ

దాహంతో అల్లాడుతున్న విశాఖ

వాన జాడ లేదు.. నీటి చుక్క కనబడడం లేదు.. నదులు ఎండిపోతున్నాయి.. జలాశయాలు అడుగంటి పోతున్నాయి.. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో విశాఖ తాగు నీటికి విలవిలలాడుతోంది.

సిటీ ఆఫ్ డెస్టినీ.. విశాఖ దాహంతో అల్లాడుతోంది. దప్పిక తీర్చుకునే మార్గం కానరాక గొంతు పిడచకట్టుకుపోతోంది. నగరంలోని అన్ని ప్రాంతాలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. రెండు మూడు రోజులకు ఒకసారి నీరు వదులడంతో పాటు.. సమయాన్ని కూడా తగ్గించడంతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు.. అపార్ట్ మెంట్ల లో నివసించే వారి బాధ వర్ణనాతీతం.. వచ్చే కొద్ది పాటి నీటిని పంచుకుంటే ఒక్కో ఫ్లాట్ కు ఒక్క బిందెడు మాత్రమే దక్కుతున్నాయి.

వర్షాలు లేక.. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. దీనికి తోడు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇళ్ళు, అపార్ట్ మెంట్లతో నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సరైన అనుమతులు లేని నిర్మాణాలకు విశాఖ లో లెక్కే లేకుండా పోతోందంటున్నారు స్థానికులు.

ఎండిపోయిన బోర్లు, పనిచేయని నీటి పథకాలతో అరకొరగా వచ్చే నీటితో పనులు సాగక.. ప్రతి ఒక్కరూ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనాల్సి వస్తోంది.. డబ్బు ఖర్చు చేస్తున్నా కావాల్సినంత నీరు మాత్రం దొరకడం లేదు.. ట్యాంకర్ కు ఆర్డర్ ఇస్తే.. ఎప్పుడో కానీ రావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

కనీస అవసరాల మాట దేవుడెరుగు.. కనీసం తాగటానికి కూడా నీరు దొరక్క విశాఖ వాసులు విలవిల్లాడుతున్నారు. మంచినీటి కోసం త్వరలో రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకూ మంచినీటి సమస్య అంటే తెలీని విశాఖ శివారు ప్రాంతాలు కూడా ఈ ఏడాది చుక్క నీటి కోసం కుస్తీలు పడాల్సిన దుస్థితి దాపురించింది.

జీవిఎంసీ కూడా చేతులెత్తేయడంతో విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి పోయింది. కుళాయిల ద్వారా నీళ్ళు రాని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా.. అన్ని ప్రాంతాలకు ట్యాంకర్లను పంపించలేని స్థితిలో అధికారులున్నారు. మధురవాడ, సీతమ్మధార, నక్కవాని పాలెం ఏరియాలకు ఒక సమయమంటూ లేకుండా ఇష్టారాజ్యంగా.. అదీ అరకొరగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని పనులు మానుకుని నీళ్ళ కోసమే జనం ఎదురుచూడాల్సి వస్తోంది.

కంచరపాలెం, తాటిచెట్లపాలెం, శ్రీనివాస నగర్ లకు కొన్ని రోజులుగా తాగు నీరందడం లేదంటున్నారు. ఇక్కడి ప్రజలు కిరాణ దుకాణాల్లో డబ్బు చెల్లించి వాటర్ క్యాన్లను కొంటున్నారు. అయినా నీటి సమస్య తీరడం లేదని వాపోతున్నారు. వీధుల్లో ఏర్పాటు చేసిన చేతి పంపులు చెడిపోవడంతో అనివార్యంగా నీళ్ళను కొంటున్నారు.. ఇదే అదనుగా వాటర్ సప్లయర్స్ బాటిల్ ధరను అమాంతం పెంచేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. 20 రూపాయల వాటర్ బాటిల్ ఇప్పుడు 70 రూపాయలకు చేరిందంటే దోపిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.అంత ధర పోసి కొనటానికి సిద్ధ పడినా.. అవసరమైనన్ని దొరికే అవకాశం లేదని వాపోతున్నారు.

వీధుల్లో చేతిపంపులు కూడా పాడైపోవడంతో నీటికోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి సిటీలో కనిపిస్తుంది. దీంతో చాలామంది మినరల్ వాటర్ బాటిల్స్‌మీదే ఆధారడపడుతున్నారు. ఇదే అదునుగా మినరల్ వాటర్ బాటిల్ సప్లయిర్స్‌ అమాంతం ధరను పెంచేసి అందినకాడికి దోచేసుకుంటున్నారు. మొన్నటి వరకూ 20,30 రూపాయల ఉండే ధర ఇపుడు 70 రూపాయలకు చేరింది. పోనీ అంతధర పెట్టి కొందామన్నా అవి కూడా ఎపుడు దొరుకుతాయో తెలీని స్థితి విశాఖలో నెలకొంది.

ఏలేరు కాలువ గండి కారణంగా జీవీఎంసీ పరిధిలోని 80 శాతం వరకు మంచినీటి సరఫరా బంద్‌ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ గండిని పూడ్చి వేసినా ఏలేశ్వరం నుంచి నీటి ప్రవాహం నగరానికి చేరుకోవాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. దీంతో ఈ వేసవికి విశాఖ వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు.

విశాఖ నగరానికి 2వందల ఎంజీడీల నీరు అవసరం. కానీ 120 ఎంజీడీల నీరు మాత్రమే లభ్యమవుతోంది. ఇందులో 60 ఎంజీడీల నీరు ఏలేరు కాలువ నుంచి వస్తోంది. బచావత్ తీర్పు ప్రకారం విశాఖకు 400 ఎంజీడీల నీరు అందివ్వాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు. వేసవి లో ఎలాగూ పడరాని పాట్లు పడిన విశాఖ వాసులు వర్షాకాలంలో కూడా నీటి కోసం తిప్పలు పడటం నిజంగా విచారకరం.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *