ఐసీసీ అవార్డులను క్లీన్‌స్వీప్ చేసిన విరాట్

ఐసీసీ అవార్డులను క్లీన్‌స్వీప్ చేసిన విరాట్
ఫార్మాట్‌తో పనిలేదు. పిచ్‌తో సంబంధం లేదు. ప్రత్యర్థితో గొడవే లేదు. ఎక్కడైనా సరే..ఎప్పుడైనా సరే…ఏ సీజన్ అయినా సరే…ఒక్కటే టార్గెట్ అతడికి. బ్యాట్‌ని ఝులిపించడం. పరుగుల వర్షం కురిపించడం. పిడుగులా గర్జించడం. జట్టుని గెలుపు వాకిట నిలబెట్టడం. ఇప్పటికే అతనెవరో ఊహించి ఉంటారు. అతనే…భారత జట్టు సారథి విరాట్ కొహ్లీ. వన్డేలు, టెస్టులు, టీ20లు అని తేడా లేకుండా గెలిచాడు. జట్టుని గెలిపించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆసీస్ ఏ దేశంలోని మైదానమైనా కొట్టాడు..జట్టుని గెలిపించాడు. ఎవరితో ఆడినా…ఎప్పుడు ఆడినా పరుగులు చేయడం తప్పా, గెలుపుని తప్పా ఇంకేం అక్కరలేదన్నట్టు ఆడాడు. ఇంత ట్రాక్ రికార్డ్ సాధించిన విరాట్ కొహ్లీ ఆటకు ప్రేమలో పడిన ఇంటర్‌నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) అవార్డులు ఇచ్చింది. అదికూడా హ్యాట్రిక్ అవార్డులు. ఈ విషయాన్ని ధృవపరుస్తూ ‘హ్యాట్రిక్ హీరో’ అని ఐసీసీ ట్వీట్ చేసింది.

ఏ ఫార్మాట్‌ని వదల్లేదు…

2018 ఏడాదిలో అన్ని ఫార్మాట్లలోను కలిపి 37 మ్యాచ్‌ల్లో 47 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 1,735 పరుగులు సాధించిన కొహ్లీ 68.37 సగటుని సాధించాడు. ఈ మ్యాచ్‌ల్లో 11 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని 2018లో ‘గార్‌ఫీల్డ్ సోబెర్స్’ అవార్డుకి కొహ్లీని ఎంపిక చేసింది. ఇదే అవార్డు 2017లో కూడా కొహ్లీనే తీసుకోవడం విశేషం. ఏడాది కాలంలో అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఆటతీరుని కనబర్చిన ఆటగాళ్లకు ఐసీసీ ఈ అవార్డుని ఇస్తుంది.

అత్యంత వేగంగా !

2018 ఐసీసీ టెస్ట్ కెప్టెన్‌గా కొహ్లీ మొదటిసారి ఎంపికయ్యాడు. గతేడాది 55.08 యావరేజ్‌తో 1,322 పరుగులు సాధించి కొహ్లీ టెస్టులో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల మైదానాల్లో సెంచరీలు చేశాడు. వన్డేల్లోనూ పరుగుల సునామీ సృష్టించడంతో ఐసీసీ వన్డే కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. 1,202 పరుగులతో 133.55 యావరేజ్‌తో వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో విరాట్ ఐసీసీ అత్యుత్తమ అవార్డులన్నిటినీ క్లీన్ స్వీప్ చేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *