వెనెజులాలో భయంకర పరిస్థితులు

వెనెజులాలో భయంకర పరిస్థితులు

ప్రజాస్వామ్యం పేరుతో పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టే అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం రాలేదు. భౌగోళిక రాజకీయాల్లో రష్యా ఎంత బలమైందో అమెరికాకు మరోసారి అర్థమైంది. దీంతో వెనెజులాలో అధికార మార్పిడికి చేసిన తిరుగుబాటు యత్నం విఫలమైంది.

పెట్రో దేశమైన వెనెజులాలో ఇప్పుడు భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశాధ్యక్ష పదవి విషయంలో ఘర్షణలు చెలరేగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తానే దేశ అధ్యక్షుడినని ప్రతిపక్ష నేత గుయాడో ప్రకటించుకున్నారు. అధ్యక్షునిగా ఆయనను గుర్తిస్తున్నట్టు అమెరికాతో పాటు, పొరుగుదేశాలైన బ్రెజిల్‌, కొలంబియా, పెరు, అర్జెంటినాలు ప్రకటించాయి. అయితే ఈ చర్యను రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు ఖండించాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్‌ మదురోకే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాలని ఐక్యరాజ్య సమితి సూచించగా, తాజాగా ఎన్నికలు జరపడమే మేలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడింది.

చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ మదురో పాలనలో వెనెజు లా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయన సైన్యం, రష్యా సహకారంతో పాలన కొనసాగిస్తున్నారు. పరిస్థితులను గమనించిన విపక్ష నేత గుయాడో తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను దేశ తాత్కాలిక నేతగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన విడుదల చేశారు. దీనికి బదులుగా అమెరికాతో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు మదురో తెలిపారు. అయితే మాజీ అధ్యక్షునిగా మారినందున ఆయనకు ఆ అధికారం లేదని అమెరికా తిప్పికొట్టింది. ఇలా వెనెజులా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టింది అమెరికా.

కొన్ని నెలలుగా వెనెజులాలో రాజకీయ, భద్రతా పరిస్థితులు క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు జువాన్‌ గుయాడో, నికోలస్‌ మదురోను గద్దె దింపేందుకు పోరాడాలని పిలుపు నిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో సైన్యం కూడా తమకు మద్దతు ఇవ్వాలని గుయాడో కోరారు. కానీ సైన్యం దీనిని పట్టించుకోలేదు. తాము మదురో వెనుకే ఉన్నామని సైన్యం ప్రకటించింది. అయితే ట్రంప్‌ కార్యవర్గం గుయాడోకు పూర్తి మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ట్వీట్లు కూడా చేసింది. గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష నేత గుయాడో అమెరికాతో టచ్‌లో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో అమెరికా నుంచి గుయాడోకు అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు లభించలేదు. దీంతో ఈ తిరుగుబాటును.. అధ్యక్షుడు మదురోకు మద్దతుగా ఉన్న సైన్యం అణచి వేసింది. ఈ అణిచివేత సందర్భంగా చెలరేగిన హింసలో దాదాపు 52 మంది గాయపడ్డారు.

కొన్ని వారాల క్రితమే రష్యా సేనలు వెనెజువెలాలో కాలుమోపాయి. దీంతో పరిస్థితి మరింత క్షీణించింది. రష్యాకు ఇక్కడ భారీగా పెట్టుబడులు ఉండటంతో వాటిని రక్షించుకోవాలంటే మదురో అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. అమెరికా మద్దతు ఉన్న గుయాడో అధికారంలో వస్తే కష్టాలు తప్పవని భావించింది. దీంతో రష్యా సహాయసహకారాలను మదురో కు అందించి ఉద్యమాన్ని అణిచివేసింది. ట్రంప్ గుయాడో కు సహకారం అందించి భంగపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *