హాజీపూర్ హత్యల వెనుక బడాగ్యాంగ్ హస్తం

హాజీపూర్ హత్యల వెనుక బడాగ్యాంగ్ హస్తం

హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. శ్రీనివాసరెడ్డి అరాచకాలపై ఓ వైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే..మరోవైపు మోజో టీవీకి అజ్ఞాత వ్యక్తులు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ ఘోరాల్లో మరికొందరి ప్రమేయం ఉన్నట్టు అందులో ఆరోపణలు చేశారు. సాక్షులకు పోలీసులు రక్షణ కల్పిస్తే మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తాయంటూ లేఖలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

హాజీపూర్ వరుస హత్యల ఉదంతం వెనుక ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. విలేజ్ సర్వైవర్స్ గ్రూప్ పేరుతో మోజో టీవీకి వచ్చిన ఓ లేఖలో సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. హాజీపూర్ అత్యాచారాలు, హత్యల వెనుక ఉన్న ఒక పెద్ద గ్యాంగ్‌ను కాపాడేందుకే శ్రీనివాసరెడ్డి పేరును తెరపైకి తెచ్చారని ఆ లేఖలో గుర్తు తెలియని వ్యక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు వరుస అత్యాచార,హత్యల్లో పాల్గొన్నట్టు కొందరు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారని లేఖలో వెల్లడించారు. అయితే ఆ బడాగ్యాంగ్‌తో ప్రాణహాని ఉండటం వల్ల ప్రత్యక్ష సాక్షులు బయటకు రాలేకపోతున్నారని…..పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తే బయటకు వచ్చి అన్ని వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు లెటర్‌లో తెలిపారు.

ఓ పాల వ్యాపారి కుమారుడు, ఓ కేబుల్ వ్యాపారి కుమారుడు కూడా అత్యాచారం, హత్యల్లో ఉన్నట్టు లేఖలో అనుమానాలు వ్యక్తం చేశారు. వీరందర్నీ కాపాడేందుకు ఒక ప్రజాప్రతినిధి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెడుతున్నట్టు లేఖలో విలేజ్‌ సర్వైవర్స్‌ గ్రూప్ తెలిపింది. నిందితులను రక్షిస్తున్న వ్యక్తితో పాటు నేరాల్లో ఇన్వాల్వ్ అయిన యువకుడి తండ్రి కూడా బడా గ్యాంగ్‌ ప్రొద్భలంతో కొన్ని నేరాలకు పాల్పడినట్టు లేఖలో ఉంది. అంతేకాదు….వీరిద్దరూ ఇటీవల ఎస్‌సీ, ఎస్‌టీ కేసు కింద అరెస్ట్ కూడా అయ్యారని లెటర్‌లో వెల్లడించారు.

బడాగ్యాంగ్ వెనుక ఉన్న ప్రజాప్రతినిధికి చెందిన పెట్రోల్‌ బంకులు, ఫామ్ హౌస్‌లో సోదాలు జరిపితే….మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశముందనే లెటర్‌లో తెలిపారు. హాజీపూర్ గ్రామంలోని అమాయక ప్రజలను కాపాడేందుకు పోలీసులు, మీడియా, రాజకీయ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టాలని లేఖలో వెల్లడించారు.. అరాచకాలకు పాల్పడుతున్న బడాగ్యాంగ్ ఆట కట్టించాలని కోరుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *