విజయ్‌ మాల్యాను ఉంచబోయే సెల్‌ వీడియో

విజయ్‌ మాల్యాను ఉంచబోయే సెల్‌ వీడియో

భారత్‌లోని బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పరారైన విజ‌య్‌ మాల్యాను స్వదేశానికి తీసుకురావడానికి సిబిఐ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైలులో ఆయనకు సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు సీబీఐ అధికారులు లండన్‌ కోర్టుకు నివేదించారు. ముంబై జైల్లో విజయ్‌ మాల్యాను ఉంచబోయే సెల్‌ వీడియోను తీసి కోర్టుకు సమర్పించారు. 

భారత్‌లో జైళ్లు బాగుండవ్

vijay mallya

టీవీ, పర్సనల్‌ టాయిలెట్‌, బెడ్, వాష్‌ చేసుకునే ఏరియా, ఎల్లప్పుడూ సూర్యుని కాంతి పడేలా వెంటిలేషన్‌.. ఇదిగో చూడండి.. జైలు ఎంత బాగా రూపుదిద్దుకుందో… ఇంతకుమించిన సౌకర్యాలు కావాలా? అంటూ సీబీఐ, యూకే కోర్టుకు ఓ వీడియో డాక్యుమెంటరీ సమర్పించింది. ఇంతకీ ఈ వీడియో ఏంటి, దీని కథేంటి, అనుకుంటున్నారా? విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలనే కేసుపై యూకే కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే భారత్‌లో జైళ్లు బాగుండవని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో నక్కిన విజయ్‌ మాల్యా, యూకే కోర్టులో వాదించారు. 

అయితే మాల్యా వాదనల మేరకు ఆయన్ను భారత్‌కు అప్పగిస్తే, ఆయనను ఎక్కడ ఉంచుతారు? జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? నిందితుడి సెల్‌ ఏ విధంగా ఉంటుందో చూపుతూ ముంబై జైలు వీడియోను తమకు సమర్పించాలని సీబీఐను యూకే కోర్టు ఆదేశించింది. యూకే కోర్టు ఆదేశాల మేరకు మాల్యాను ఉంచే ముంబై ఆర్థుర్‌ రోడ్‌ జైలులోని బరాక్‌ నెంబర్‌ 12ను, అక్కడ ఉండే సౌకర్యాలను చూపిస్తూ.. 6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియోను తీసిన సీబీఐ డాక్యుమెంటరీ రూపంలో యూకే కోర్టుకు సమర్పించింది. ఇదే మాల్యా నివాసం అని పేర్కొంది. కాగా భారత జైళ్లలో తాజా గాలి, సహజ సిద్ధమైన కాంతి ఉండవని విజయ్‌మాల్యా ఆరోపించారు. మాల్యాను ఉంచబోయే సెల్‌ ముఖద్వారం తూర్పువైపు ఉంటుంది. అంటే సూర్యకాంతి మంచిగా పడుతుంది అని అధికారులు చెప్పారు. కిటికి తలుపులు, ఇరువైపుల బార్లతో మాల్యాను ఉంచబోయే సెల్‌ మంచి వెంటిలేషన్‌ను కలిగి ఉంటుందని వెల్లడించారు. విజయ్‌మాల్యాకు లైబ్రరీ యాక్సస్‌ కూడా కల్పిస్తామని ఈ వీడియో తీసిన అధికారి చెప్పారు. 

తదుపరి విచారణ సెప్టెంబర్‌ 12న

ఇక జైలులోని సెల్‌లన్నింటినీ సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంటాయని, బరాక్‌ వెలుపల, లోపల అదనపు గార్డులు ఉంటారని, వారు 24 గంటల పాటు బరాక్‌కు కాపాలాగా ఉంటారని అధికారులు చెప్పారు. రోజులో నాలుగు సార్లు భోజనం అందిస్తామని, ఆర్థూర్‌ రోడ్డు జైలులోని బరాక్‌ 12 ఎక్కువగా హై-ప్రొఫైల్‌ ఖైదీలకు మాత్రమే వాడనున్నట్టు తెలిపారు. ఎవరికైతే భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉంటుందో, వారు ఎవరికైనా ముప్పు కలిగిస్తారని అనుమానం ఉన్నా.. వారిని బరాక్‌లోనే ఉంచనున్నట్టు చెప్పారు.
 
 మొత్తం మీద బ్యాంక్‌లకు దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన మాల్యాను కూడా భారత్‌కు రప్పిస్తే ఇక్కడే ఉంచనున్నారు. ఆయన్ను భారత్‌కు అప్పగించే వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 12న జరుగనుంది. మరోవైపు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్‌లో ఎలాంటి లోపాలు లేవని, హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపై సెక్యురిటీ ఆడిట్‌ చేపట్టిందని తెలిపారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *