ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎలా మారాయి..?

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎలా మారాయి..?

యూపీ లో ఎక్కువ స్థానాలు సాధించే పార్టీ కేంద్రంలో అధికారంలోకి కచ్చితంగా వస్తుంది. అందుకే యూపీ పై అన్నీ పార్టీలు ఫోకస్ పెడుతుంటాయి. మోదీ, సోనియా, రాహుల్, లాంటి హేమాహేమీలందరూ యూపీనుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 80 స్థానాల్లో 71 స్థానాలు గెలిచి సత్తా చాటింది. ప్రతిపక్షాలు కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. యూపీలో కీలక పార్టీలు అయిన ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీచేస్తున్నాయి. ఈ ఫలితంగా బీజేపీ ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఎస్పీ, బీఎస్పీలు దళితులను రెచ్చగొట్టడం కారణంగా అగ్రవర్ణాల్లో ఐక్యత వచ్చి బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల వారు బీజేపీ వైపు మళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసినప్పుడు బీఎస్పీ, ఎస్పీల కూటమికి 45 శాతం ఓట్లు రావచ్చునని, బీజేపీ ఓట్ల శాతం 34.2 వరకూ ఉండవచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొనడం, పశువధశాలపై నిషేధం తమ ఉపాధికి గండికొట్టిందని ఒక వర్గం వారు భావిస్తూండటం వల్ల బీజేపీ కి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. అంతేకాదు . నగరాలకు హిందూ పేర్లు పెట్టడం కూడా ఓ వర్గ ఓటర్లకు బీజేపీ పై వ్యతిరేకత తెచ్చి పెడుతోంది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ తన తురుపు ముక్క ప్రియాంక ను యూపీ కి ఇన్‌ ఛార్జ్ ను చేసి ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరింది. ప్రియాంక వచ్చిన తర్వాత యూపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగైందని చెప్పవచ్చు. కనీసం పదిస్థానాల్లో ఆ పార్టీ గౌరవప్రదమైన ఓట్లు కొల్లగొడుతోందన్న అంచనాలు ఉన్నాయి. హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి ప్రియాంక గంగాయాత్రను చేసి సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పరిస్థితి 2014 కంటే ఇప్పుడు మెరుగ్గా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రియాంక చీల్చే ఓట్ల వల్ల ఎస్పీ, బీఎస్పీలకు తీవ్ర నష్టం జరిగి, బీజేపీకి లాభం చేకూరే పరిస్థితులు కనబడుతున్నాయి.

ఏదేమైనా యూపీలో ఎస్పీ, బీఎస్పీ లు కలిసి బీజేపీ ఓట్లను కొల్లగొట్టే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. యోగీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి అంశాలు బీజేపీ పై పడితే కమలం వాడిపోక తప్పదన్న విశ్లేషణలు బలంగా వినబడుతున్నాయి. బీజేపీ అభ్యర్థులు నేరుగా అఖిలేష్‌ను మాత్రమే విమర్శిస్తుండటం.. మాయావతిపై పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని చూస్తే భవిష్యత్ లో మాయాతో బీజేపీ అంటకాగే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *