షిప్పింగ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లపై ఇరాన్‌ దాడి...తిప్పికొట్టిన అమెరికా

షిప్పింగ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లపై ఇరాన్‌ దాడి...తిప్పికొట్టిన అమెరికా

అమెరికా-ఇరాన్‌ మధ్య భారీ ఎత్తున సైబర్‌ యుద్ధం మొదలైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇరాన్‌కు చెందిన సైబర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అమెరికాకు చెందిన షిప్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసింది. దీని ఆధారంగా పౌర నౌకలను, యుద్ధ నౌకల ట్రాకింగ్‌ డేటాను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన సైబర్‌ కమాండ్‌ రెండు ఆయిల్‌ ట్యాంకర్లపై దాడికి కారణమైన ఇరాన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలపైనే దాడి చేసింది.

జరిగింది ఇదీ..
ఇటీవల ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ అమెరికాకు చెందిన ఒక మెరైన్‌ ట్రాఫిక్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసింది. దీని నుంచి పౌర నౌకల వివరాలను సేకరించింది. దీంతోపాటు హర్మూజ్‌ జలసంధిలో అమెరికా యుద్ధనౌకల డిజిటల్‌ సిగ్నేచర్లను కూడా సేకరించింది. కాకపోతే ఇక్కడ అమెరికా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను గందరగోళానికి గురిచేసిన అంశం ఒకటుంది. ఈ సమాచారం మొత్తం ఆ వెబ్‌సైట్‌ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తుంటే.. ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ హ్యాకింగ్‌కు ఎందుకు పాల్పడిందో వారికి అర్థం కాలేదు. దీనికి ప్రతిగానే ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థపై అమెరికా సైబర్‌ కమాండ్‌ దాడికి తెగబడింది. ఈ దాడి తీవ్రత, జరిగిన నష్టాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు.

అమెరికా నావికులకు వలపు వల..
ఇరాన్‌కు చెందిన సైబర్‌ గూఢచారులు తప్పుడు సోషల్‌ మీడియా ఖాతాలను తెరిచి అమెరికా నావికులకు ఉచ్చులు వేస్తున్నారు. ఈ ఖాతాల్లో మహిళల నగ్నచిత్రాలను ఉంచి నావికులను ఆకర్షించే యత్నాలు చేస్తున్నారు. ఈ ఉచ్చులో పడిన నావికుల నుంచి నౌక వివరాలు, రూట్‌మ్యాప్‌లను తెలుసుకొంటున్నారు. ఈ విషయాన్ని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఇరాన్‌ హ్యాకర్లు అత్యంత సమర్థవంతమైన, క్లిష్టమైన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *