ఓటర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ఊహించని షాక్!

ఓటర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ఊహించని షాక్!

ఏపీలో ఎన్నికలకు ఓటు వేయడానికి వెళ్లే ప్రజలకు కావేరీ ట్రావెల్స్ షాక్ ఇచ్చింది. 10వ తేదీన ఏపీకి వెళ్లాల్సిన వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 125 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. టికెట్‌లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయా ఏర్పాట్లు చేయకుండా టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో ఏపీకి ఓటు వేయడానికి వెళ్లాల్సిన దాదాపు 5000 మంది ప్రయాణికులు స్వస్థాలకు వెళ్లడానికి లేకుండా ఇబ్బందులకు గురయ్యారు.

గత కొద్ది రోజులుగా ఎన్నికల సమయంలో ఏపీకి వెళ్లాల్సిన బస్సులను రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను నిజం చేస్తూ కావేరీ ట్రావెల్స్ 125 బస్సులను రద్దు చేయడం వివాదానికి అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో నివశించే ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు ఇప్పటికీ సొంతూళ్లలోనే ఓటు హక్కు ఉంది. 11న ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లక్షలాది ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల్లో టికెట్‌లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది 10న ఊర్లకు వెళ్లడానికి టికెట్‌లు రిజర్వ్ చేసుకున్నారు. కావేరీ ట్రావెల్స్ వారు నడపాల్సిన 125 బస్సు సర్వీసులను అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అనుకోని కారణాల వల్లే బస్సు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులకు వారి డబ్బులు వాపసు చేస్తామని కావేరీ యాజమాన్యం ప్రయాణికులకు ఎస్ఎంఎస్ చేసింది. బస్సులకు సరిపడినంతమంది డ్రైవర్లు లేని కారణంగానే సర్వీసులు నిలిపివేసినట్లు కావేరీ యాజమాన్యం చెబుతున్నా.. భాగస్వాముల మధ్య వివాదాల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల సమయంలోనే ఇలా జరగడంతో కొందరు రాజకీయనాయకులు, కార్యకర్తలు మాత్రం హైదరాబాద్‌లోని ప్రజలు ఆంధ్రాలో ఓటు వేయకుండా చేయడానికే ఇలా అర్ధాంతరంగా బస్సులను నిలిపివేసినట్లు చర్చిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *