అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజర్

అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజర్

భారత్‌ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. జైషే మహమ్మద్‌ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. గతంలో పదే పదే మసూద్‌ను వెనకేసుకొచ్చిన చైనా…ఇండియా చూపిన ఆధారాలతో ఈసారి నోరుమూసుకోక తప్పలేదు. ఫలితంగా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు లైన్ క్లియర్ అయింది.

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ అందించిన సాక్ష్యాలకు తోడు ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా ఫలించడంతో మసూద్ అజర్ మీద చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయాన్ని ట్విట్ చేశారు.

మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ పదేళ్లకుపైగా ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి అనేక సార్లు విజ్ఞప్తి చేసింది. అయితే చైనా తన వీటో అధికారంతో భారత్‌ ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల పుల్వామాలో దాడి తర్వాత.. భారత్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఈసారి మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలను అందించింది. దీంతో డ్రాగన్ కంట్రీ దిగిరాక తప్పలేదు.

భారత్ అంటే మసూద్‌ అజర్‌కు విపరీతమైన ద్వేషం. భారత్‌లో విధ్వంసాలు సృష్టించడానికి ఎన్నో కుట్రలు పన్నాడు. భారత పార్లమెంటుపై దాడి నుంచి.. ఇటీవలి పుల్వామా మారణహోమం వరకు అనేక ఘటనల్లో మసూద్‌ హస్తముంది. మొత్తానికి భారత్‌ చేసిన అనేకానేక ప్రయత్నాల అనంతరం.. చివరకు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్య రాజ్య సమితి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *