నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్

నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ని ప్రకటించారు. విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. జాతీయ భద్రత కోసం అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్‌ సేవలను ప్రస్తుతం వినియోగిస్తున్నాయి. అయితే ట్రంప్ ఇక విదేశీ టెలికామ్ సేవలను వినియోగించకూడదని ఆదేశించారు. ఈ ఆదేశాల్లో ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. చైనాకు చెందిన హువావేని దృష్టిలో పెట్టుకోని ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.

అయితే ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాలు , హువాయి కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశాయి. హువాయి కంపెనీ చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆయా దేశాలు ఆరోపణలు చేశాయి . దీనికి తోడు అమెరికా హువావే 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది.

నేషనల్‌ ఎమర్జెన్సీతోపాటు అమెరికా మరో చర్య కూడా తీసుకొంది. దీని ప్రకారం హువావేపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది అమెరికా. ఈ చర్యతో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ఆంక్షలపై హువావే స్పందించింది. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని పేర్కొంది. అమెరికా అర్థంలేని ఆంక్షలు విధిస్తోందని విమర్శించింది హువావే.

ఏదేమైనా ట్రంప్ నిర్ణయంతో చైనా, అమెరికా సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు కనబడుతున్నాయి. మున్ముందు ఈ చర్యలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *