ఇరాన్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ఇరాన్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్‌ ఎందుకు వెనక్కి తగ్గారు . వెనక్కి తగ్గాలని ట్రంప్‌ కు సలహా ఇచ్చిందెవరు? ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ వెనక్కి తగ్గారా? ఇంతకీ…అమెరికా – ఇరాన్‌ మధ్య యుద్ధం వస్తుందా? రాదా?. ఇరాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందా? వాచ్ దిస్ స్టోరీ

ట్రంప్ కోపం ఒక్క దెబ్బకు పోయింది. గురువారం ఇరాన్‌ గగనతలంపై ప్రయాణిస్తున్న అమెరికా డ్రోన్‌ను రివల్యూషనరీ గార్డ్స్‌ బలగాలు కూల్చివేయడంతో ఆయన గంభీరంగా గర్జించారు. ఇరాన్‌ చాలా పెద్దతప్పు చేసింది అని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. యుద్ధానికి సిద్ధం కావాలని దళాలను ఆదేశించాడు. ఇంతలోనే ఏమైందో ఏమో..తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నాడు. దాడి చేస్తే 150 మంది చనిపోతారని జనరల్ హెచ్చరించడంతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

అమెరికా చెప్పిన మాట ఇరాన్‌ చప్పున వింటే ఆ దేశాన్ని ఆర్థిక శక్తిగా మారుస్తామంటూ తాయిలం వేశారు. తన సహజ శైలికి భిన్నంగా ట్రంప్‌లో అర్జెంట్‌గా ఇంత జాలి ఉప్పొంగటానికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తేగానీ అర్థంకావు. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల పేరు చెప్పి తల్లీబిడ్డలను కూడా వేరుచేయడానికి ట్రంప్‌ ఏరోజు వెనుకాడలేదు. చివరికి సొంత కుటుంబసభ్యుల నుంచి దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఆప్ఘన్ లో టెర్రరిస్ట్‌ల మీద మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ ను ప్రయోగించిన ట్రంప్‌..ఇరాన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు.

గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సూచీ ప్రకారం ఇరాన్‌ ప్రపంచంలో 14వ అతిపెద్ద సైనిక శక్తి. ఇరాన్‌లో మొత్తం 7లక్షలకు పైగా దళాలు ఉన్నాయి. వీటిల్లో 3.50లక్షల సంప్రదాయ సైనిక దళాలు కాగా మిగిలినవి వివిధ రూపాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా దాదాపు 1.25లక్షల మంది ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ , 20వేల మంది రివల్యూషనరీ గార్డ్స్‌ నావికా దళం సిబ్బంది ఉన్నారు. ఇరాక్‌, లిబియాలతో పోలిస్తే ఇరాన్‌ దళాలు చాలా భిన్నమైనవి. ఇరాక్‌, లిబియాలు సంప్రదాయ సైనిక దళాలను మాత్రమే పెంచుకొన్నాయి. గెరిల్లా యుద్ధతంత్రాన్ని పాటించే రెబల్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకోలేదు. కానీ, ఇరాన్‌ అలా కాదు హిజ్బోల్లా వంటి రెబల్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకొంది. ఇటువంటి దళాలు ఇరాక్‌, లెబనాన్‌లలో తిష్టవేసుకొని ఉన్నాయి. ఇప్పుడు అమెరికా యద్ధం మొదలు పెడితే వీటితో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది అంత తేలిగ్గా ముగిసే వ్యవహారం కాదు. అఫ్గానిస్థాన్‌ అనుభవాలు అమెరికాకు పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది.

సిరియాలో అమెరికా దూకుడుగా ఉండకపోవడానికి రష్యాకు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్‌-300 కూడా ఒక ప్రధాన కారణం. ఇరాన్‌ వద్ద కూడా ఎస్‌-300ను పోలిన ఆయుధాలు ఉన్నాయి. వీటికి రష్యా 2016లో క్షిపణులను సరఫరా చేసింది. ఇటీవల ఇరాన్‌ ఈ వ్యవస్థలను యుద్ధానికి సిద్ధం చేసింది. మిగ్‌-29, సూ-24 బాంబర్లు కూడా ఉన్నాయి. దీనికితోడు భారీ ఎత్తున మోహరించిన యాంటీ షిప్‌ మిసైల్స్‌ వ్యవస్థలు కూడా ఒక ప్రధాన కారణం. పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే హర్మూజ్‌ జలసంధి మూసుకుపోతుంది.

అంతేకాదు..స్వదేశంలో కూడా అమెరికాకు చాలా సమస్యలున్నాయి. అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభిస్తే 60 రోజుల్లోపు ముగించాలి . ఇది సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో ట్రంప్ ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గి పరువు కాపాడుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *