వాణిజ్య యుద్ధానికి బ్రేక్‌

వాణిజ్య యుద్ధానికి బ్రేక్‌

అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. జపాన్‌లోని ఒకసాలో జరిగిన జీ 20 సదస్సు ట్రంప్, జిన్‌పింగ్ లను కలిపింది.అమెరికా, చైనాల మధ్య ఇన్నాళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జీ 20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను కలిశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలో ఆగిపోయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరువురూ అంగీకరించారు.ఈ వివాదం పరిష్కారమయ్యేవరకూ చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించబోమని ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు.

చైనాతో తమకు శత్రుత్వం లేదనీ, అమెరికా–చైనాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య లోటుపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల కమిటీలు త్వరలో సమావేశమవుతాయని ఇరుదేశాలు వెల్లడించాయి.అమెరికాతో గొడవలకు దిగితే ఆర్థికంగా నష్టపోతామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ కూడా తెలిపారు.

అమెరికాతో ఉన్న 539 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్‌ గతంలో చైనాను డిమాండ్‌ చేశారు. అలాగే అమెరికా కంపెనీల మేధోపరమైన హక్కులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు చెందిన వాణిజ్య బృందాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సత్ఫలితాలు రాలేదు. దీంతో 250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై 25 శాతం మేర సుంకాలను పెంచుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది. అయితే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా తమకు నష్టం జరుగుతోందని గుర్తించిన ఇరుదేశాలు తాజాగా సయోధ్యకు ముందుకొచ్చాయి.

ఏదేమైనా వాణిజ్య చర్చలు జరగడం అమెరికా, చైనా రెండు దేశాలకూ ముఖ్యమే. ఈ చర్చలు సక్రమంగా జరిగి ఫలప్రదం అయితే రెండు దేశాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *