9 స్థానాలకు పరిమితమైన టీఆర్ఎస్‌...

9 స్థానాలకు పరిమితమైన టీఆర్ఎస్‌...

తెలంగాణలో అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. టాప్‌గేర్‌లో దూసుకెళ్లిన కారుకు స్పీడ్‌బ్రేక్‌ తగిలింది. అంచనాలకు భిన్నంగా టీఆర్ఎస్‌కు ఎంపీ తగ్గగా.. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడ్డ బీజేపీ ఈసారి బలంగా పుంజుకుంది. కాంగ్రెస్‌ కూడా బలం పెంచుకోవడంతో టీఆర్ఎస్‌ 16 సీట్ల నినాదానికి గండిపడింది.

కారు.. సారూ.. పదహారు… ఢిల్లీలో సర్కారు అంటూ ప్రచారం చేసిన టీఆర్ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. మిగతా సీట్లను పక్కనపెడితే నిజామాబాద్‌, కరీంనగర్‌లో ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. ఉద్యమ సమయం నుంచి ఆయవు పట్టుగా ఉన్న కరీంనగర్‌ కోటను బీజేపీ బద్దలు కొట్టింది. ఇక నల్గొండ, భువనగిరిలో అనుకున్నట్లే కాంగ్రెస్‌ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోటల్ని బద్దలు కొట్టిన టీఆర్ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో సేమ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయింది. కేంద్రంలో తమ పార్టీలో అధికారంలోకి వస్తాయన్న అంచనాతో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ఆయా పార్టీలకు కలిసొచ్చింది.

గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన సీట్లకంటే తక్కువ స్థానాలు రావడాన్ని టీఆర్ఎస్‌ సీరియస్‌గా తీసుకుంటోంది. సర్వేలు, విశ్లేషకులు కారుకు ఎదురులేదని చెప్పినా.. వాస్తవంలో రిజల్ట్స్‌ మరోలా వచ్చాయి. దీంతో 16 సీట్లు వస్తాయనుకున్న టీఆర్ఎస్‌ 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు హైదరాబాద్‌ ఎంపీ సీటును ఎంఐఎం గెలుచుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిన బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌.. ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు గెలుపొందారు. ఇక సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో కిషన్‌ రెడ్డి.. అలాగే నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌ గెలుపొందారు.

బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటింది. నల్గొండలో తొలినుంచి ఆధిక్యం ప్రదర్శించిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. అటు భువనగిరి, మల్కాజ్‌గిరిలో జరిగిన బిగ్‌ఫైట్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్కాజ్‌గిరిలో రేవంత్‌ రెడ్డిని విజయం వరించింది.

టీఆర్ఎస్‌ విషాయానికొస్తే.. ఉత్కంఠ భరితంగా సాగిన చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిపై టీఆర్ఎస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి విజయం సాధించారు. ఇక మెదక్‌, వరంగల్‌లో కారు జోరు కొనసాగింది. మెదక్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, వరంగల్‌లో పసునూరి దయాకర్‌లు భారీ మెజార్టీతో గెలుపొందారు. అటు ఖమ్మం ఎంపీ బరిలో నిలిచిన నామా నాగేశ్వర్‌రావు గెలిచి సీఎంకు ఎంపీ సీటును గిఫ్టుగా ఇవ్వగా… పెద్దపల్లిలో వెంకటేష్‌, నాగర్‌కర్నూల్‌ పి, రాములు, మహబూబ్‌నగర్‌ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌లో మాలోతు కవితలు విజయం సాధించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *