మండలి అభ్యర్ధులు... కారులో కుదుపులు!!

మండలి అభ్యర్ధులు... కారులో కుదుపులు!!

తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తి ప్రబలుతోందా? అధినేత నిర్ణయాల పట్ల కిందిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పరిషత్ ఎన్నికల్లో మొదలైన పెదవి విరుపులు ఇప్పుడు మండలి ఎన్నికల వరకూ చేరాయంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మూడు మండలి సీట్లు కేటాయించడం కారులో కుదుపునకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు వరంగల్ జిల్లా స్థానిక సంస్థల మండలి అభ్యర్థి ఎంపిక పలువురికి నచ్చడం లేదంటున్నారు. ఇక్కడ నుంచి పార్టీ సీనియర్ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని అభ్యర్థిగా అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి మండలి టిక్కెట్ లభించనుందని తొలుత వార్తలు వచ్చాయి.

అలా ప్రకటించాడు…

అసెంబ్లీ ఫలితాల తరువాత కేసీఆర్ ఓ సందర్భంలో సిరికొండ నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఏదో రకంగా ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ మండలి టికెట్ ఖరారు చేస్తారని భావించారు. ఇందులో నెగ్గితే మధుసూదనాచారికి మండలి చైర్మన్‌ పదవో, మంత్రి పదవో లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తం అయ్యింది. అనూహ్యంగా శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో వారంతా హతాశులయ్యారని సమాచారం. నిజానికి గులాబీ దళపతి కేసీఆర్ ముందుగా సిరికొండకే టికెట్ ఇవ్వాలని అనుకున్నారనీ, కేటీఆర్ రంగ ప్రవేశం చేసి శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేయించారనీ అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి కూడా సీనియర్ నేతే. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్నవారే. ఉద్యమంలోనూ చురుకుగా పని చేసారనే పేరూ ఉంది. కానీ, ఎందుకో ఆయన అభ్యర్థిత్వం పట్ల పార్టీ శ్రేణుల నుంచి అంతగా సానుకూలత వ్యక్తం కాలేదని సమాచారం. మధుసూదనాచారి పట్ల కేసీఆర్‌కు మంచి అభిప్రాయమే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవడంతో సానుభూతి కూడా ఉందని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్‌కు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. వారిద్దరి ఒత్తిడితోనే శ్రీనివాస్ రెడ్డికి చివరి నిమిషంలో టికెట్ ఖరారైందని తెలుస్తోంది. ఆయనను గెలిపించే బాధ్యతను స్థానిక మంత్రి దయాకర్ రావుకు, ఎమ్మెల్యేలకు అప్పగించారని సమాచారం. మరోవైపు పార్టీలో మొదటిసారిగా మూడు మండలి టికెట్లను ఒకే సామాజికవర్గానికి కేటాయించడం పలువురిని ఆశ్చర్య పరిచిందని చెబుతున్నారు. పార్టీలో మిగిలిన సామాజిక వర్గాల వారు అధినేత కేసీఆర్‌కు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే, పార్టీలో కొందరు సీనియర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలనుకుంటున్న కేసీఆర్ ఆ పార్టీకి ఎప్పటి నుంచో సానుభూతి పరులుగాపేరు తెచ్చుకున్న రెడ్డి కులస్తులను తన వైపు తిప్పుకుందేకే ఇలా చేశారని చెబుతున్నారు. మొత్తానికి మండలి సీట్ల ఎంపిక మాత్రం కారును ఓ కుదుపు కుదుపోతోందంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *