టీ పీసీసీ పగ్గాలు ఎవరికీ..?

టీ పీసీసీ పగ్గాలు ఎవరికీ..?

పీసీసీ పోస్ట్‌ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ, హైక‌మాండ్ ప‌రిశీల‌న‌లో మాత్రం ఆ ఇద్దరే ఉన్నారట. అయితే, ఆ ఇద్దరిలో ఒకరు పదవి ఇవ్వకపోతే పార్టీ మారే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే, ఆయన వైపు అనూమానంగా చూస్తోన్న అధిష్ఠానం, ప్రస్తుత బాస్ సూచించిన వారివైపే మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ, హైకమాండ్ మదిలో ఉన్న ఆ ఇద్దరు ఎవరు?

టీ పీసీసీ రేసులో తెలంగాణ నుంచి ప్రముఖంగా ఇప్పుడు ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందట. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల నుంచి ఉత్తమ్ తప్పుకోనున్నారు. ఈనేపథ్యంలో ఆ ప‌ద‌విని ఆశిస్తున్న కొంత‌మంది నాయ‌కులు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పీసీసీ కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, తాజాగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కడంతో, అధిష్ఠానం ఆయనపై సీరియస్‌గా ఉందట. పీసీసీ పదవి విషయంలో హైకమాండ్ వారిని పనక్కనబెట్టినట్టుగా సమాచారం.

శ్రీధర్ బాబుకు పార్టీ ప‌గ్గాలు అప్పగించాల‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సిఫార్సు చేసిన‌ట్టుగా పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని పార్టీకి చెందిన కొంత‌మంది నాయ‌కులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. త్వరలోనే వీరిద్దరికి హైక‌మాండ్ నుంచి పిలుపు వ‌స్తుంద‌నీ, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానం త‌న‌ను బుజ్జగించేందుకు పిలుస్తుంద‌నీ, ఆ సంద‌ర్భంగా పీసీసీ బాధ్యత‌లు ఇవ్వాల‌ని ఆయ‌న కోరే అకాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరికపై కమలం పెద్దలతో చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి హస్తిన కూడా వెళ్లినట్టు చర్చ జరిగింది. అయితే, దీన్ని రాజగోపాల్ రెడ్డి కొట్టిపారేశారు. తన ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. తన సోదరుడు వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం కోసమే వచ్చినట్టు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే, రాష్ట్రంలో హస్తం పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

కాంగ్రెస్ పార్టీ పనైపోయింద‌న్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఈ అల‌జ‌డిని ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో హైక‌మాండ్ ఉందా… అంటే, లేద‌నే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యత‌ల నుంచి రాహుల్ గాంధీ త‌ప్పుకోవాలని భావిస్తున్నారు. ఎంతమంది నచ్చజెప్పినా ఆయన వినడం లేదట. ఈ పరిస్థితుల్లో, ఇప్పటికిప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ గూరించి హైకమాండ్ పట్టించుకునే పరిస్థితి లేదు. జాతీయ అధ్యక్ష ప‌ద‌వికి సంబంధించిన చ‌ర్చ స‌ద్దుమ‌ణ‌గ‌గానే… తెలంగాణ‌లో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామ‌కం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఐతే, అధిష్టానం దృష్టిలో రేవంత్, శ్రీధర్‌బాబుల పేర్లు ప్రముఖంగా ఉన్నట్టుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలు వలస బాట పడుతున్నారు. టీఆర్ఎస్..బీజేపీ పార్టీలు హస్తం నేతలను ఆకర్షిస్తుండడంతో, వాటిని ఎలా నియంత్రించాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తలపట్టుకుంటోంది. ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేల్లో, 12 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో, ప్రస్తుతం ఆ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈలోగా రాష్ట్రంలోకి దూసుకొచ్చిన కమలం పార్టీ ఆపరేషన్ కాంగ్రెస్‌ చేపట్టింది. ఇప్పటికే డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ , విజయరామారావు వంటి చాలా మంది నాయకులకు బీజేపీ కండువా కప్పేసింది. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *