విశాఖలో నాలుగు ముక్కలాట

విశాఖలో నాలుగు ముక్కలాట

విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల ప్రకటన వెలువడటంతో, పోటీ తీవ్రతరమైంది. ఇక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీ పడుతుంతడగా, వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ బస్తీమే సవాల్ అంటున్నారు. ఇక, బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలో దిగుతున్నారు. భరత్, పురంధేశ్వరి ఇద్దరూ బంధువులు కావడంతో, స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పురంధేశ్వరి మినహా మిగతా ముగ్గురు అభ్యర్థులు ఎన్నికలకు కొత్త వారే. తొలుత భరత్ రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన్ను చంద్రబాబు విశాఖ పార్లమెంట్ బరిలో నిలిపారు. ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడైన భరత్, తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలుత జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు పేరుని ప్రకటించగా..ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. దీంతో, ఇదే సమయంలో పార్టీలో చేరిన లక్ష్మీనారాయణను విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపారు. లక్ష్మీనారాయణ టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, అనూహ్యంగా జనసేనలో చేరి, విశాఖ ఎంపీ టికెట్‌ను దక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇప్పటికే ప్రచార వేగం పెంచారు. లక్ష్మీనారాయణ, టీడీపీ టార్గెట్‌గా వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

విశాఖ లోక్ సభ సెగ్మెంట్‌లో త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో…. మాజీ మంత్రి పురంధేశ్వరి తాను సైతం అంటూ పోటీలోకి దూసుకొచ్చారు. విశాఖపట్నం పార్లమెంట్‌ స్థానానికి దగ్గుబాటి పురందేశ్వరి పేరును బీజేపీ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీతో పొత్తులో భాగంగా హరిబాబు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రెండు పార్టీలు తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో విడిపోయి పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానానికి హరిబాబుతో పాటుగా పురందేశ్వరి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి అధిష్టానం పురందేశ్వరి పేరుని ఖరారు చేసింది. ఆమె ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆమె 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా కాంగ్రెస్‌ తరపున గెలిచి మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ విశాఖ పార్లమెంట్‌ అభ్యర్థిగా పేడాడ రమణకుమారి పోటీ చేయనున్నారు.

సంక్షేమ పథకాలే తమ గెలుపుకు దోహదపడుతాయని అధికార పార్టీలు భావిస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా అంతిమంగా విశాఖ ఎంపీ స్థానంలో సత్తా చాటే నేత ఎవరన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆల్ పార్టీస్ పోటీ పడుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *