తెరపైకి డ్రగ్స్ కేసు..తూతూ మంత్రంగా చార్జీషీట్

తెరపైకి డ్రగ్స్ కేసు..తూతూ మంత్రంగా చార్జీషీట్

అసలు సినిమా ముందుందన్నారు.. అంతన్నారు.. ఇంతన్నారు..? అసలు పేర్లు ఎందుకు దాచారు..? ఇంతకీ డ్రగ్స్‌ తీసుకున్న వారు నిందితులా.. బాధితులా.. పోలీసులు ఏం తేల్చారు. ఇవన్నీ పక్కనపెడితే… తాజాగా ఇంటర్‌ బోర్డు వైఫల్యం, విద్యార్థుల ఆత్మహత్యలు, హాజీపూర్‌లో వరుస హత్యలపై జరుగుతున్న ఆందోళనలు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాయి. ఇలాంటి సమయంలో ఆయా కేసులను పక్కదారి పట్టించేందుకే టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును తెరమీదకి తీసుకువచ్చారా. ఏడాది క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడు హైలెట్‌ చేయడం ప్రజల దృష్టి మరల్చడానికేనా..?

టాలీవుడ్‌ను షేక్‌ చేసిన డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ టాలీవుడ్‌కు ముచ్చెమటలు పట్టించింది. కొందరు సినిమా నటీనటలు డ్రగ్స్‌ అడిక్ట్స్‌ అంటూ బాంబు పేల్చడంతో టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ కేసులో కెల్విన్‌ ముఠా పట్టుబడటంతో చాలామంది పేర్లు బయకొచ్చాయి. ఈ నేపథ్యంలో 11 మంది నటీనటులకు ఎక్సైజ్‌ శాఖ నోటీసులు కూడా జారీచేసింది. పూరీ జగన్నాథ్‌, రవితేజ, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌, చార్మీ, ముమైత్‌ ఖాన్‌, నందు, శ్యాంకేనాయుడు, చిన్నా, తనీష్‌ ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే వారిని పూర్తిస్థాయిలో విచారించిన అధికారులు స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేశారు. వీరిలో పూరీ జగన్నాథ్‌, తరుణ్‌, సుబ్బరాజు నుంచి శాంపుల్స్‌ సేకరించారు. వెంట్రుకలు, గోళ్లు, రక్తనమూనాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు.

అప్పట్లో దాదాపు రెండుమూడు నెలలు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు చాలా హడావుడిగా సాగింది. ఆ తర్వాత అంతగా ముందుకు సాగలేదు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి నివేదిక కోర్టుకు వెళ్లిందని ప్రచారం జరిగినా.. అది తప్పని తేలింది. దీంతో మొత్తం 12కేసులు నమోదు చేసింది ఎక్సైజ్‌ శాఖ. ఇందులో 11 కేసుల్లో డ్రగ్స్‌ తీసుకున్నారంటూ అభియోగాలు ఎదుర్కున్న వారినుంచి శాంపుల్స్‌ సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్‌, తరుణ్‌, సుబ్బరాజులు ఉన్నారు. ఇదిలాఉంటే.. విచారణ ఎదుర్కొన్న వారు డ్రగ్స్‌ తీసుకోలేదా.. ఫోరెన్సిక్‌ నివేదికలో వీరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు రిపోర్ట్‌ రాలేదా.. మరి ఛార్జిషీట్‌లో వీరి పేర్లు ఎందుకు రాలేదు. రిపోర్ట్‌లో పేర్లు రానప్పుడు ఛార్జ్‌షీట్‌ ఎందుకు.. సినిమా నటులు డ్రగ్స్‌ తీసుకున్నారని.. వారికి డ్రగ్స్‌ సప్లై చేశానని అలెక్స్‌ తన వాంగ్మూలంలో చెప్పాడు. అయినా దానిని అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఇంతకీ సిట్‌ విచారణలో ఏం తేల్చింది.. విచారణ అంశాలను గోప్యంగా ఎందుకు ఉంచింది. ఇండస్ట్రీలోని ప్రముఖుల పేర్లు ఛార్జిషీట్‌లో ఎందుకు బయటపెట్టలేదన్న అంశాలు వివాదాస్పదమవుతున్నాయి.

మొత్తం ఈ కేసులో 62 మంది హీరో హీరోయిన్ల పేర్లు లేకుండానే తూతూమంత్రంగా నాలుగు ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది సిట్‌. సినీ తారాగణంలోని ప్రముఖుల నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన సిట్‌ ఇప్పుడు వారి పేర్ల ఎక్కడా చేర్చలేదు. దీంతో సెలబ్రిటీలకు సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లయింది. నాలుగు ఛార్జిషీట్‌లలో ఒకటి సౌతాఫ్రికా పౌరుడు అలెక్స్‌ పైన దాఖలు చేశారు. ఇదిలాఉంటే మరో 8 కేసుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయనుంది సిట్‌. మరి నిందితుల జాబితాలో ఉన్న వారిని అరెస్టు చేస్తారా. లేదంటే ఛార్జిషీట్‌లో పేర్లకు మాత్రమే పరిమితం చేస్తారా.. అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కొందరు టాలీవుడ్‌ పెద్దలు ఈ కేసుపై ప్రభావం చూపుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఇదిలాఉంటే టాలీవుడ్‌లో ముగ్గురు అగ్రతారలకు నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఇటీవల ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఫలితాలు గందరగోళంగా విడుదలయ్యాయి. దీంతో మెరిట్‌ ర్యాంక్‌ స్టూడెంట్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఆ అవమానభారాన్ని తట్టుకోలేక.. దాదాపు 27మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇంటర్‌ బోర్డు తీరుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అటు హాజీపూర్‌లో విద్యార్థినుల వరుస హత్యలు సంచలనం సృష్టించాయి. సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే ఈ రెండు అంశాలపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్‌ కేసును తెరపైకి తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో వరుస ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టాలీవుడ్‌ కేసును తెరమీదకు తీసుకువచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *