శబరిమల చరిత్రలోనే తొలిసారి..!

శబరిమల చరిత్రలోనే తొలిసారి..!

సుప్రీం తీర్పు తర్వాత శబరిమల ఆలయం రెండోసారి తెరుచుకుంది. దీంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో శబరిమలైకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. 1 0 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు శబరిమలలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని ఇప్పటికే వివిధ సంఘాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Sabarimala Security

గట్టి భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు

ఆలయం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. శబరిమల, పంబ, నెలిక్కళ్‌, ఇలౌంగళ్‌ ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇద్దరు ఐజీలు, 10 మంది ఎస్పీలు, 2 వేల 300 మంది పోలీసులు శబరిమల లో విధుల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం 15 మంది మహిళా పోలీస్‌ ఉద్యోగులను ఆలయం వద్ద భద్రతా విధుల నిర్వహణ కోసం నియమించింది. అయితే వీరంతా 50 ఏళ్ల పైబడిన వారు కావడం గమనార్హం. ఆలయ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు.. 50 ఏళ్ల పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా 50 ఏళ్ల పైబడిన మహిళా పోలీసు అధికారులను నియమించింది.

మహిళలను అడ్డుకోవడమే

ఈ సందర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ తాము ఇక్కడ కేటాయించిన విధులు నిర్వహించడానికి వచ్చామని అన్నారు. ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే తమ ప్రధాన బాధ్యత అని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పుగురించి నో కామెంట్స్‌ అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు మహిళలు దేవాలయంలో ప్రవేశించేందుకు వస్తున్నారా? అనే అంశాన్ని భక్తులు నిశితంగా పరిశీలించారు. ఒకే చోట గుంపుగా వ్యక్తులు గుమిగూడకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

మీడియాను పోలీసులు అనుమతించడం లేదు

ఇదిలావుండగా శబరిమల దేవాలయ తంత్రి కందరారు రాజీవరుతో మాట్లాడేందుకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. సన్నిధానం వద్ద ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినపుడు పోలీసులు నిరోధించారు. దేవాలయ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ, రుతుస్రావం జరిగే వయసులో ఉన్న మహిళలు దేవాలయంలోకి ప్రవేశించేందుకు వస్తే, తాను దేవాలయాన్ని మూసివేస్తానని తంత్రి హెచ్చరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తంత్రి వివరణ కోరేందుకు కొందరు విలేకర్లు ప్రయత్నించినపుడు, పోలీసులు నిరోధించారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని చెప్తూ, తంత్రితో విలేకర్లు మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *