జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు నానీలు

జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు నానీలు

ఒక ముఖ్యమంత్రి జట్టులో ఒకే పేరు మీద ఇద్దరు మంత్రులు ఉండటం అరుదు. అలాంటిది ఏకంగా ముగ్గురు ఉండటం ఆసక్తికరకమనే చెప్పాలి. పాతిక మంది మంత్రులతో కొలువుదీరిన కేబినెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జగన్ జట్టులో నానిల పంట పండింది. తనకు అత్యంత సన్నిహితుల్ని సైతం పక్కనబెట్టి, సరికొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన జగన్ తీరుపై జోరుగా చర్చ సాగుతోంది. జగన్ టీంలో ట్రిపుల్ ఎన్‌గా మారిన ఆ ముగ్గురు మంత్రులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించిన వైసీపీ, 25 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఆచితూచి మంత్రుల పేర్లను ఖరారు చేశారు. ఐతే, జగన్ కేబినెట్‌లో ముగ్గురు నానిలు జాక్ పాట్ కొట్టారు. కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నానికి మంత్రివర్గంలో చోటు కల్పించటం ఒక అంశమైతే.. ఆ ముగ్గురిలో ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని నాలుగోసారి విజయం సాధించారు. ఈయన అసలు పేరు కొడాలి వెంకటేశ్వరరావు. కానీ, నానిగా అందరికి సుపరిచితుడు. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన కొడాలి, ఆ తర్వాత జగన్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మరోసారి విజయబావుటా ఎగురవేశారు. దూకుడుగా వ్యవహరించే నాని.. టీడీపీ నేతలపై విరుచుకుపడటంలో ముందుంటారు. ఎన్నికల అనంతరం కూడా చంద్రబాబుపై నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొడాలి…ఏ శాఖ దక్కించుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

జగన్ జట్టులో ఉన్న మరో నాని ఆళ్ల నాని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్లనాని, మూడో సారి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2014లో సమీప ప్రత్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆయన అసలు పేరు కాళీ కృష్ణ. అయితే, ఆళ్ల నానీ గానే ముద్రపడ్డారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పేర్ని నాని జగన్ జట్టులో స్థానం సంపాదించారు. ఆయన అసలు పేరు పేర్ని వెంకట రామయ్య అయినప్పటికీ.. ఆయన్ను నానిగా పిలుస్తుంటారు. పేర్ని నాని 1999లో కాంగ్రెస్ తరఫున బందరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004, 2009లో వరుసగా విజయం సాధించారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన నాని, ఈసారి 5వేల పైచీలుకు ఓట్ల మెజారిటీతో కొల్లు రవీంద్రపై గెలుపొందారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *