పోస్టల్ బ్యాలెట్... ఎవరికి తగులుతుంది బుల్లెట్..!?

పోస్టల్ బ్యాలెట్... ఎవరికి తగులుతుంది బుల్లెట్..!?

ఆంధ్రప్రదేశ్‌ల్‌ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. అయితే ఇంకా ఓటు వేయని వారు లక్షల్లో ఉన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటు వేయడం ఏమిటి అనుకుంటున్నారా…! అవును… ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ, 25 స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు మూడు లక్షల మంది ఉన్నారు. వారే ప్రభుత్వ ఉద్యోగులు. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వారంతా ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నెల 23న ఒకవైపు ఫలితాలు వెలువడుతుంటే మరోవైపు ఈ ప్రభుత్వ ఉద్యోగులు మూడు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంతకుముందు వీరంతా తమకు పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వాటిని పరిశీలించిన ఎన్నికల సంఘం మూడు లక్షల పైచిలుకు మందికి పోస్టల్ బ్యాలెట్లను విడుదల చేసింది.

పోటాపోటీగా…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఈసారి పోటాపోటీగా, నువ్వానేనా అనే స్థాయిలో జరిగాయి. దీంతో మెజారిటీ మాట దేవుడెరుగు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామా..? అని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్క ఓటూ కీలకమైన దశలో పోస్టల్ బ్యాలెట్లు మరింత కీలకం కానున్నాయి. శాసనసభ స్థానాలకు సంబంధించి ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యధికంగా 32 వేల పోస్టల్ బ్యాలెట్‌లున్నాయి. ఇక అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 16 వేల పోస్టల్ బ్యాలెట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల వరకూ పోస్టల్ బ్యాలెట్‌లు ఉన్నట్టుగా ఓ అంచనా. ప్రతి ఓటూ కీలకమైన దశలో ఈ పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి పడతాయన్నది ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు మూడు లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వస్తాయని తేలడంతో అన్ని పార్టీల అభ్యర్థుల దృష్టి వాటిపై పడింది. ఓటు వేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే ప్రలోభాలకు గురి చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు బుల్లెట్లుగా మారి ఏ పార్టీని ముంచుతాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉంటారో వారినే విజయం వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పోస్టల్ బుల్లెట్లు ఎవరికి తగతాయో తేలాలంటే మరో ఎనిమిది రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *