వైసీపీలోకి తోట ఫ్యామిలీ..చినరాజప్పను ఢీకొట్టనున్న వాణి

వైసీపీలోకి తోట ఫ్యామిలీ..చినరాజప్పను ఢీకొట్టనున్న వాణి

తోట వాణి ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారా..?జగ్గంపేటలో సీటు చేజారిపోయిందా..? చినరాజప్పపై పోటీకి సై అంటున్నారా..? గోదావరి జిల్లాల్లో మరింత పెట్టు పెంచుకోవాలని టీడీపీ, ఎలాగైనా అక్కడ పాగా వేయాలని వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. దీంతో, గోదావరి జిల్లా రాజకీయం రసకందాయంగా మారింది.

తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. అనారోగ్యం కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న నరసింహం, తన సతీమణికి వైసీపీ నుంచి పెద్దాపురం సీటు ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. నరసింహం తన సతీమణి కోసం జగ్గంపేట సీటు కోరగా, వైసీపీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. దీంతో, తోట నరసింహంను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ చక్రం తిప్పింది. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన తోట దంపతులు చంద్రబాబుపై మండిపడ్డారు.

పెద్దాపురం నుంచి ప్రస్తుతం హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినథ్యం వహిస్తున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు మరోసారి ఖరారు చేశారు. ఇక చినరాజప్పను ఢీకొట్టేందుకు వైసీపీ నుంచి తోట వాణి రెడీ అవుతున్నారు. గతంలో తోట వాణి తండ్రి మెట్ల సత్యనారాయణ, చినరాజప్ప మధ్య వైరం ఉంది. అధిష్టానం తమను గుర్తించకుండా హోంమంత్రి చినరాజప్ప అడ్డుపడ్డారని తోట ఫ్యామిలీ ఆరోపిస్తోంది. తన తండ్రి, భర్తకు టీడీపీ తీరని అన్యాయం చేసిందని వాణి ఫైరవుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త గురించి చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని, సీటు ఇవ్వకుండా జిల్లా టీడీపీ పెద్దలు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తంగా గోదావరి జిల్లాల నుంచి వస్తున్న వలసవాదులతో స్థానికంగా బలపడుతామన్న విశ్వాసంతో వైసీపీ వర్గాలు ఉన్నాయి. మరి, రానున్న ఎన్నికల్లో తోట ఫ్యామిలీ వైసీపీకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *