ఆ విషయంలో జగన్‌ - చంద్రబాబు ఒకటేనా ?

ఆ విషయంలో జగన్‌ - చంద్రబాబు ఒకటేనా ?

జాతీయ పార్టీల ఊసే లేకుండా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకుంటూ సత్తా చాటుతున్నాయి. ఐతే, మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారుతోంది. ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా బీజేపీ ఫోకస్ చేసిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపించి, జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఐతే, ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ తెరవెనుక పావులు కదుపుతోంది. టీడీపీని కబళించి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు వలసలను ప్రోత్సహిస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు లేకున్నా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఉదంతాలున్నాయి. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఈశాన్యంలో ప్రాంతీయ పార్టీలను పరేషాన్ చేసింది. పశ్చిమబెంగాల్‌లో ఉనికి లేని బీజేపీ ఏకంగా 18 స్థానాల్లో గెలుపొంది టీఎంసీకి గట్టి షాక్ ఇచ్చింది. తాజా గెలుపుతో అధికార తృణమూల్ – ప్రతిపక్ష సీపీఐని టార్గెట్ చేసింది. అక్కడ పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. తమిళనాడులో నేషనల్ పార్టీలకు లోకల్ పార్టీలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. అన్నాడీఎంకే లేదంటే డీఎంకే…పార్టీని కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. తమిళనాడు విషయంలో మాత్రం బీజేపీ పాచిక పారడం లేదు.

ఏపీలోకి బీజేపీ ఎంట్రీ అయితే, త్వరలో తనకూ అదే పరిస్ధితి తప్పదని భావిస్తున్న జగన్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆకర్ష్ ప్రయోగం మాజీ నేతలకే కాదు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలకు తగులుతుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే బీజేపీ విపక్షంగా అవతరించినా ఆశ్చర్యం లేదనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టీడీపీకి ప్రత్యామ్నాయంగా అసెంబ్లీలో అడుగుపెట్టే బీజేపీ… రాబోయే రోజుల్లో తమను టార్గెట్ చేయడం ఖాయమనే భయం వైసీపీ అధినాయకత్వంలో కనిపిస్తోంది. అందుకే గత టీడీపీ ప్రభుత్వం తరహాలో కాకుండా విపక్షానికి తగిన అవకాశాలు కల్పిస్తామని సీఎం పదే పదే చెబుతున్నారు. టీడీపీతో పోలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రమాదకరమన్న భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. బెంగాల్, ఒడిశా అనుభవాల దృష్ట్యా.. టీడీపీ ఉనికిలో ఉండటమే తమకు మేలని వైసీపీ భావిస్తోందట.

టీడీపీని బలహీనం చేస్తే భవిష్యత్తులో ఏర్పడే శూన్యాన్ని బీజేపీ భర్తీ చేస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే ఫిరాయింపులకు దూరంగా ఉండటంతో పాటు టీడీపీకి అవసరమైన ప్రాధాన్యం ఇవ్వాలనేది వైసీపీ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వ మనుగడకు ఇప్పట్లో ఎలాంటి ఢోకా లేదు. అటువంటప్పుడు టీడీపీ నుంచి ఫిరాయింపులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించరాదని సీఎం జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీని నిలువరించేందుకు వైసీపీ-టీడీపీలు ఆలోచనలో పడ్డాయట. బీజేపీ బలపడనీయకుండా నేతలను కాపాడుకోవడానికి జగన్, చంద్రబాబులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారట.

వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీ నుంచి ఫిరాయింపులను పోత్సహించకపోవడం కూడా చంద్రబాబుకు శ్రీరామరక్ష అవుతోంది. అదే సమయంలో టీడీపీ నేతలు బీజేపీలోకి పోకుండా బాబు కాపాడుకుంటున్నారు. ఉమ్మడి శత్రువైన బీజేపీని రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా చేయడంలో…. జగన్ తోడ్పాటు బాబుకు ఉందనడానికి, ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడమే కారణం అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ బలహీన పడితే జగన్ కు లాభం కన్నా నష్టమే ఎక్కువన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే టీడీపీని పరోక్షంగా జగన్ కాపాడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *