ప్రేమ, అవకాశాల మధ్యలో నలిగి సీరియల్ నటి ఆత్మహత్య

ప్రేమ, అవకాశాల మధ్యలో నలిగి  సీరియల్ నటి ఆత్మహత్య
జీవితం మీద ఆశ కోల్పోవడం అంటే మనుషుల పట్ల నమ్మకం కోల్పోవడమే…ఓటమి లేకుండా ఏ మనిషి ఏ దశలోను జీవితాన్ని అనుభవించలేడు. ఇంతపెద్ద ప్రపంచంలో అనుకున్నది జరగకపోతే…ఎంచుకున్న లక్ష్యం నెరవేరకపోతే నష్టమేమీ ఉండదు. సృష్టి.. మనిషికి ఇచ్చిన గొప్ప వరం…జీవించడానికి అనే మార్గాలను మన చుట్టూనే ఉంచడం. మన ఆసక్తికొద్దీ ఎంచుకునే నేర్పుని మనం సంపాదించుకోవాలి. ఓటమికికి మొదటి మెట్టు.. విఫలమైనదాన్ని జీవితానికి అన్వయించుకోవడం. ఏ ప్రయత్నంలోనైనా విఫలమవడం ఒక భాగమే కాని ఓటమి కాదు. ఇలాంటి ప్రతికూల సమయాల్లో తీసుకునే నిర్ణయాలు చుట్టూ ఉన్నవారిపై, సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎదురైన ఓటమిని గాని, కష్టాన్ని గాని ఎంత సంయమనంతో ఎదుర్కొన్నామనేదే జీవితం విలువ ఏంటో చెబుతుంది.
 
సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ప్రయాస పడుతుంటారు. ఇదొక ప్రవాహం. ఇందులో దూకి ఎదురీదకపోయినా…నీళ్లు తోసేస్తున్నప్పుడు ఎంత బలంగా నిలబడగలిగాం అనేది ముఖ్యమైంది. కానీ నిలబడలేను అనే మానసిక అసౌకర్యాన్ని పెద్దదిగా చూసి నీళ్లలో మునిగి చనిపోదామనుకోవడం అవివేకం.
 
TV Actress Jhansi Suicide

అతనికోసం వదిలేసింది…అతను పొమ్మన్నాడు!

సినిమాల్లో, టీవీ ప్రోగ్రామ్‌ల్లో అవకాశాల రాక ఎంతోమంది క్షణికావేశంలో ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. మంగళవారం టీవీ నటి ఝాన్సీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న తను…మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమవుతున్న పవిత్రబంధం సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం మొదటి కారణమైతే…ప్రేమ వల్ల అవకాశాలు తగ్గిపోవడం మరో కారణం. సూర్య అనే వ్యక్తి పరిచయం అవడంతో సీరియల్‌లో నటించడం మానేసింది. అతనితోనే జీవితం అనుకుని పెళ్లి గురించి అడిగితే అతన్నుంచి సరైన స్పందన రాకపోవడంతో మనస్తాపం చెందింది. జీవితం పట్ల ఆశ కోల్పోయింది. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆఫీస్ నుంచి వచ్చిన ఆమె సోదరుడు తన పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

నెలలుగా గొడవలు

ఆవకాశాలు రాకపోవడం, సూర్యతో ప్రేమ వ్యవహారంలో విఫలమవడమే ఆత్మహత్యకు ముఖ్య కారణాలని బంధువులు అంటున్నారు. మంగళవారం ఉదయం సూర్యతో గొడవ జరిగినట్టు తెలియజేశారు. గత మూడు నెలలుగా సూర్య, ఝాన్సీల మధ్య ఇలాంటి గొడవలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి విజయవాడ వెళ్లగా, ఓ బైక్ షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తోన్న సోదరుడు విధులకు వెళ్లిపోయాడు. దీంతో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరోవైపు సూర్య కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *