కమలం వైపు కదులుతున్న తెలుగునేతలు

కమలం వైపు కదులుతున్న తెలుగునేతలు

తెలుగు రాష్ట్రాలలో కమలం క్రేజ్ పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పార్టీలకు చెందిన వారు బిజేపీలో చేరేందుకు ఉరకలు వేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాలుగు స్దానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కాంగ్రెస్ నాయకులు కొందరు బిజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాంటి వారిలో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, జగ్గారెడ్డి ఉన్నారంటున్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కూడా బిజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆయన తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్ సభ స్దానం నుంచి బిజేపీ అభ్యర్దిగా గెలుపొందారు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో తనకు ప్రాధాన్యం తగ్గిందని డి. శ్రీనివాస్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.

సిద్ధాంతాలతో పనిలేకుండా ఎవరినైనా రావచ్చు!
ఇక ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలంగా లేకపోయినా భవిష్యత్తులో ఆ పార్టీకి మంచి రోజులు ఉంటాయని అక్కడి నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్ సభకు ఎన్నికైన కేశినేని నాని బిజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపైన, ఆ పార్టీ పైన ట్విట్ల యుద్దం ప్రారంభించారు కేశినేని నాని. ఆయనతో పాటు విజయవాడకు చెందిన తెలుగుదేశం నాయకులు బిజేపీలో చేరే అవకాశాలున్నాయి అని అంటున్నారు. ఇక ఎన్నికల ముందు జనసేనలో చేరి విశాఖ లోక్ సభ స్దానంలో పోటీ చేసిన సిబిఐ మాజీ అధికారి జే.డి. లక్ష్మీ నారయణ భారతీయ జనతా పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా సిద్దాంతాలతో సంబంధం లేకుండా పార్టీకి ఉపయోగపడే సీనియర్ నాయకులు ఎవరు ఉన్నా వారిని పార్టీలో చేర్చుకోవాలని బిజేపీ అధిష్టానం స్దానిక నాయకులకు సూచించింది. ఈ సూచనల మేరకు ఏ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులైనా బిజేపీలో చేరేందుకు ముందుకు వస్తే వారిని చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *