తెలుగు రైతుల తిరుగుబాటు పాట వణుకుతున్న ఎంపీ కవిత కోట

తెలుగు రైతుల తిరుగుబాటు పాట వణుకుతున్న ఎంపీ కవిత కోట

అనగనగా తిరుగుబాటు పాటను వినిపించే తీరుతారు.గాయపడ్డ వాడి పిడికిలి ధిక్కారాన్నే జపిస్తింది.మట్టిని నమ్ముకున్న వాళ్లకూ,మనుషుల్ని నమ్ముకున్న వాళ్లకూ ఎలా నడవాలో తెల్సు.ఎటు నడవాలో తెల్సు. ప్రకృతి ఎంత మోసం చేసినా మళ్లీమళ్లీ పొలాన్నే ప్రేమించే రైతులను పదేపదే ప్రజాస్వామ్యమూ మోసం చేస్తోంది.తెలుగు రైతులను మరీ ఎక్కువ అన్యాయం చేసింది.ఏ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డా…రైతుల కడుపులను కొడుతూనే ఉన్నాయి.ప్రతి ఎన్నికల ముందు అన్నం పెట్టేవాడికే ఆశ చూపుతున్నాయి.ఒడ్డుకు చేరుకున్నాక వారి అతిచిన్న కోరికలను ఉఫ్‌ అని ఊదిపడేస్తున్నాయి.

ప్రజాస్వామిక నిర్ణయం

మన రైతులంతా మెత్తమెత్తని వాళ్లు.మట్టిన నమ్ముకున్న వాళ్లు.ప్రపంచానికి వేళకింత అన్నం పెట్టే వాళ్లు.గిట్టుబాటు ధర కోసం కడుపుచేత పట్టుకుని ఎదురుచూస్తోన్న వాళ్లు.పిల్లల్ని వదిలేసి వలసొచ్చినట్టు… నిజామ్‌బాద్‌ రైతులు పొలం దాటి బయటికొచ్చారు.నడిరోడ్డు మీదికొచ్చారు.”అయ్యా…గిట్టుబాటు ధర”అని అడుక్కున్నారు.అండగా ఉండకపోగా…ప్రశ్నించినందుకూ,పోరాడినందుకూ,ప్రాధేయపడినందుకూ ఏళ్లకుఏళ్లగా ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తూనే ఉన్నాయి.లాఠీలతో కలబడ్డాయి.రైతుల తలల్ను పగలకొట్టాయి.డొక్కల్ని కుళ్లబొడిచాయి.చివరికి ఊచల్నీ లెక్కబెట్టించాయి.అందుకే ఈ సారి పంథాను మార్చుకున్నారు.గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఎన్నికల బరిలోకి దిగి రాజ్యాల తలపొగరను దించే నిర్ణయాన్ని తీసుకున్నారు.

కల్వకుంట్ల కవిత నియోజకవర్గం… 

గత ఎన్నికల సమయంలో అన్ని రకాల హామీలూ ఇచ్చారు.జొన్న రైతులనూ,పసుపు రైతులనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని నమ్మించారు.వారి నమ్మకం మీదే ఎంపీగా విజయం సాధించిన కవిత… అధికారపు కోటను కట్టుకుంది.ఆ తర్వాత తిరిగి వారి వైపు చూడలేదు.మహాధర్నా చేస్తే లెక్కచెయ్యలేదు.కాలం రైతుల డొక్కల్ని ఎండగడుతూనే ఉంది.ఆకలినీ,అప్పుల ఆత్మహత్యలను రోజురోజుకూ పెంచుతూనే ఉంది. తట్టుకోలేకపోయారు.ఈ సారి గట్టిగా నిలదీద్దామనుకున్నారు.అధికారపు కోటలు వణికిపోయే నిర్ణయాన్ని తీసుకున్నారు.

ధిక్కార స్వరం…

అడిగీ అడిగీ గొంతెండిపోయిన రైతులంతా ఇప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు.ఈ ఎన్నికల బరిలోకి తుఫానులా దిగుతున్నారు.పసుపునూ,మొక్కజొన్ననూ,చెఱకునూ పండించే రైతులు ఇంత అన్నం కోసం, గిట్టుబాటు ధర కోసం రాజ్యంపై తిరగబడుతున్నారు.నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 230 మందికి పైగా రైతులు ఎంపీ సీటుకు నామినేషన్‌ వేశారు.అలా ఒక్కో రైతు అడుగు ముందుకు పడుతుంటే…రాజ్యం ఎంతోకొంత వణికిపోయే ఉంటుంది.దేశంలోనే అత్యధిక నామినేషన్లు వేసిన నియోజకవర్గంగా నిజామాబాద్‌ నిలిచింది.ఎన్నికల విధానాన్ని ఈవీఎం మెషిన్ల నుంచీ బ్యాలెట్‌ బాక్సుల వరకూ తీసుకొచ్చారు(ఒక నియోజక వర్గంలో 96 కంటే ఎక్కువగా నామినేషన్లు దాఖలైతే… ఆ ఎన్నికల విధానాన్ని ఈవీఎమ్‌ మెషిన్ల నుంచి బ్యాలెట్‌ బాక్సులకు మారుస్తారు). గెలుపుకు దగ్గరవ్వక పోయినా,పోరాటాన్ని నిలుపుకుంటామనే నమ్మకం ఆ రైతుల కళ్లల్లో నిండుగా ఉంది.ఈ పోరాటాన్ని గౌరవిద్దాం.అధికార కోటలను వణికించే మన రైతుల ప్రజాస్వామిక నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం.ఈ హక్కుల పోరులో నిలబడ్డ ప్రతిరైతుకూ మంచి జరగాలని కోరుకుందాం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *