టీఆర్ఎస్‌కు ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు...!

టీఆర్ఎస్‌కు ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు...!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు జాతీయ స్థాయిలో చర్చనీయాంసంగా మారింది. ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో 88 స్థానాలు గెలుపొంది ప్రతిపక్షాలకు మాట్లాడ్డానికి నోరుపెగలకుండా చేసింది. కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల్లోని కీలక నేతలను కూడా మట్టికరిపించిన గులాబీ పార్టీ…ఇదే ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయింది. ఎన్నో ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న హేమాహేమీలను కూడా ఓడించిన టీఆర్ఎస్ కూడా డిపాజిట్లు కోల్పోయిందంటే నమ్మశక్యంగా లేదు కదా..!?

ts results 2018

ఎంతో కష్టపడ్డారు…

తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి తర్వాత ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే దానిపై విపరీతమైన ఉత్కంఠ ఏర్పడింది. ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు తమ కార్యకర్తలను సన్నద్ధం చేయడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే రకరకాల అంశాలపై రెండు నెలల పాటు ఊపిరి తీసుకోవడానికి కూడా విరామం లేకుండా అన్ని రాజకీయా పార్టీలు, అందరు నాయకులు ఎంతో కష్టపడ్డారు. ఇంత ఉత్కంఠను రేపిన తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుడికే పట్టం కట్టాయి. దీంతో వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.

హైదరాబాద్‌లో…

తెలంగాణలో 119 స్థానాల్లో 88 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్…నాలుగు చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. అది కూడా హైదరాబాద్‌లోని మజ్లిస్ పార్టీ పోటీ చేసిన నాలుగు నియోజకవర్గాల్లో కారు బ్రేక్‌డౌన్ అయింది. అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేసిన చాంద్రాయణగుట్టలో 1,39,056 ఓట్లు పోల్ అయ్యాయి…ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాంరెడ్డికి 14,223 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇంకొక నియోజకవర్గం చార్మినార్‌లో 1,03,056 మంది ఓటర్లు తమ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సలావుద్దీన్‌కి 6,100 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు గెలుపు వశమైంది.

మరో నియోజకవర్గమైన కార్వాన్‌లో 1,72,719 ఓట్లు పోల్ అవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌సింగ్‌కు 10,817 ఓట్లు మాత్రమే రావాడం ఆశ్చర్యం. మజ్లిస్ అభ్యర్థి కౌసర్ మొహియుద్దీన్ విజయాన్ని దక్కించుకున్నారు. చివరి నియోజకవర్గం మలక్‌పేట్‌లో మొత్తం 1,20,443 మంది ఓటు వేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్‌కు 17,294 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ నియోజకవర్గానికి మజ్లిస్ పార్టీ నుంచి అహ్మద్ బలాలా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దుమ్ములేపే విధంగా టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరేస్తే ఈ నాలుగు స్థానాల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేనంత స్థాయిలోకి పడిపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *