తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు?

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు?

సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. పోలింగ్‌కు రిజల్ట్‌కు మధ్య ఆరు వారాల వ్యవధి నేపథ్యంలో నాయకులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా మే 23 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. విజయానికి తాము రచించిన వ్యూహం ఫలిస్తుందో లేదోనన్న టెన్షన్‌ తో ఉన్నారు.

బాక్సుల్లోని వారి భవితవ్యం మే23న బయటకు రానుంది. అయితే, ఫలితాలకు చాలా సమయం ఉండడంతో… ఈలోగా తమకు అనుకూలించే అంశాలేంటి, ప్రతికూలతలేంటి అన్న దానిపై పలువురు అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్, పంచాయతీ ఎన్నికల్లోనూ పై చేయి సాధించింది. ఇక, పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన గులాబీదళం, అనుకున్నన్ని సీట్లు గెలుచుకుంటుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే, ఆ పార్టీ నేతలు మాత్రం 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకొని, కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని చెబుతున్నారు. సీఎం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.

టీఆర్ఎస్ లెక్కలు అలా ఉంటే…కాంగ్రెస్ మాత్రం తెలంగాణలో కచ్చితంగా 10స్థానాలను గెలుచుకుంటామని చెబుతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రుణం తీర్చుకునేందుకు, రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు… ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సర్వేలు కూడా కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయని హస్తం నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రెండుసార్లు మోసం చేసి అధికారంలోకి వచ్చారని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తూ, పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని మండిపడుతున్నారు. రాహుల్ ప్రధాని అయితే, పేదలకు ఏడాదికి 72వేలు అందిస్తారని చెబుతున్నారు.

కాంగ్రెస్ లెక్కలు అలా ఉంటే….లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఆరుచోట్ల రెండోస్థానంలో బీజేపీ ఉండనుందని అంచనా. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ …హైదరాబాద్‌ స్థానంలో వన్‌మ్యాన్‌షోగా మజ్లిస్‌ హవా నడుస్తుందని, మిగిలిన 16 స్థానాల్లో ఆరింట బీజేపీ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుంటుందని చెబుతున్నారు. ఇందులో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ స్థానాలున్నాయని తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం కమలనాథులు వ్యూహాన్ని మార్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలువురు నేతలను బుట్టలో వేసుకున్న కమలనాథులు.. ఈసారి బిగ్‌షాట్స్‌పై దృష్టి పెట్టనున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఎవరి లెక్కలు ఎలా ఉన్నా, అంతిమంగా ప్రజాతీర్పు ఏవిధంగా ఉండబోతుందన్నది మే 23వ తేదీన వెలువడనున్న ఫలితాలతో తేలిపోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *