విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : విపక్షాలు

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : విపక్షాలు

ఇంటర్‌ బోర్డ్‌ తప్పిదాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే నైతిక బాధ్యత వహించి విద్యామంత్రి ఎందుకు రాజీనామా చేయరని విపక్షాలు నిలదీశాయి. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. సర్కారు తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు దిగింది.

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై నిరసన తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు పలుచోట్ల నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు. 20 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని, విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని విజయశాంతి ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తేల్చకపోతే… సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విజయశాంతి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్దకమయిందని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటర్ పరీక్షా ఫలితాల గందరగోళంపై విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఇంటర్‌ బోర్డులో జరుగుతున్న తప్పుడు విధానాలపై ప్రభుత్వం బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

అటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేతలు హన్మంతరావు, కోదండరెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్‌ సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని కాంగ్రెస్‌ నేతలు దుమ్మెత్తిపోశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *